China : చైనాలోని సంస్థలు పరిశోధన–అభివృద్ధి (R&D) రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టడంతో, ఐక్యరాజ్యసమితి వార్షిక ర్యాంకింగ్‌లో చైనా తొలిసారి అత్యంత ఆవిష్కరణాత్మక దేశాల టాప్ 10లో స్థానం సంపాదించింది. ఈ క్రమంలో యూరప్‌లోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ జర్మనీని (Germany) చైనా అధిగమించింది.
2011 నుండి స్విట్జర్లాండ్ ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, స్వీడన్ రెండో స్థానంలో, అమెరికా మూడో స్థానంలో నిలిచాయి. మొత్తం 139 ఆర్థిక వ్యవస్థలను 78 సూచికల ఆధారంగా అంచనా వేసిన గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ (GII) – 2025లో చైనా 10వ స్థానాన్ని దక్కించుకుంది.
China – R&Dలో చైనాకి దూకుడు
ప్రైవేట్ రంగం పెట్టుబడుల్లో అంతరాన్ని వేగంగా తగ్గించుకోవడం ద్వారా చైనా, ప్రపంచంలో అతిపెద్ద పరిశోధన–అభివృద్ధి వ్యయం చేసే దేశంగా మారే దిశగా సాగుతోందని GII నివేదిక తెలిపింది. అంతర్జాతీయ పేటెంట్ దరఖాస్తులలో కూడా చైనా తన స్థానం బలపరచుకుంది. 2024లో దాదాపు నాలుగో వంతు పేటెంట్ దరఖాస్తులు చైనాకు చెందగా, అమెరికా, జపాన్, జర్మనీల వాటా తగ్గినట్లు సర్వే పేర్కొంది.
ప్రపంచ ధోరణి మందగింపు
గత సంవత్సరం 2.9%గా ఉన్న గ్లోబల్ R&D పెట్టుబడులు, ఈ ఏడాది 2.3%కి పడిపోవచ్చని అంచనా. ఇది 2010 తర్వాత అత్యల్ప స్థాయిగా భావిస్తున్నారు. పెట్టుబడుల తగ్గుదలతో ప్రపంచ ఆవిష్కరణల వాతావరణం మసకబారుతోందని నివేదిక పేర్కొంది.
జర్మనీపై ప్రభావం
జర్మనీ 11వ స్థానానికి పడిపోవడం తాత్కాలికమని, దీర్ఘకాలికంగా ఆ దేశానికి పెద్ద నష్టం కలగదని GII సహ–సంపాదకుడు సచా వున్ష్–విన్సెంట్ అన్నారు. అయితే, పారిశ్రామిక ఆవిష్కరణల్లో దశాబ్దాలుగా బలమైన హోదా కలిగిన జర్మనీ, ఇప్పుడు డిజిటల్ ఆవిష్కరణల్లో కూడా శక్తి కేంద్రంగా ఎదగాల్సిన అవసరం ఉందని WIPO డైరెక్టర్ జనరల్ డేరెన్ టాంగ్ వ్యాఖ్యానించారు.
టాప్ 10 దేశాలు
ఈసారి టాప్ 10లో – స్విట్జర్లాండ్, స్వీడన్, అమెరికా, దక్షిణ కొరియా, సింగపూర్, బ్రిటన్, ఫిన్లాండ్, నెదర్లాండ్స్, డెన్మార్క్, చైనా చోటు సంపాదించాయి.
Also Read : India-US Trade Talks Interesting : భారత్-అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందాలపై కీలక అప్డేట్



















