Koil Alwar Tirumanjanam : తిరుపతి : తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మ వారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. అమ్మవారి ఆలయంలో సెప్టెంబరు 05 నుండి 07వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. పవిత్రోత్సవాల ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం (Koil Alwar Tirumanjanam) నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మ వారిని ఉదయం సుప్రభాతంతో మేల్కొలిపి సహస్ర నామార్చన నిర్వహించారు. ఆ తరువాత ఉదయం 6 నుండి 8.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం ఉదయం 9 గంటల నుండి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. ఈ కారణంగా ఆర్జితసేవలైన కల్యాణోత్సవం, ఊంజలసేవను టిటిడి రద్దు చేసింది.
Koil Alwar Tirumanjanam Updates
పవిత్రోత్సవాలను పురస్కరించుకొని సెప్టెంబరు 04న గురువారం సాయంత్రం 5.30 నుండి 7.30 గంటల వరకు విష్వక్సేనారాధన, పుణ్య హవచనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం నిర్వహిస్తారు. వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసితెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా సెప్టెంబరు 05న పవిత్రప్రతిష్ఠ, సెప్టెంబరు 06న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 07న పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగనున్నాయి. రూ.750/- చెల్లించి గృహస్తులు (ఒకరికి మూడు రోజులపాటు) ఈ పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు 2 లడ్డూలు, 2 వడలు బహుమానంగా అందజేస్తారు.
అంకురార్పణం సందర్భంగా కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. సెప్టెంబరు 05న శుక్రవారం తిరుప్పావడ సేవ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, సెప్టెంబరు 06న శనివారం అభిషేకానంతర దర్శనం, ఉదయం బ్రేక్ దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, సెప్టెంబరు 07న ఆదివారం ఉదయం బ్రేక్ దర్శనం, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవను టిటిడి (TTD) రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఆలయ అర్చకులు బాబు స్వామి, ఏఈవో దేవరాజులు, సూపరింటెండెంట్ రమేశ్, టెంపుల్ ఇస్పెక్టర్లు చలపతి, శ్రీ సుబ్బరాయుడు ఇతర అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
Also Read : TTD Interesting Updates : శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు ప్రారంభం
















