RC Bhargava : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న సుంకాలపై భారత కార్పొరేట్ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ సందర్భంలో మారుతి సుజుకీ ఇండియా (MSI) చైర్మన్ ఆర్‌సీ భార్గవ (RC Bhargava) ప్రభుత్వాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.
RC Bhargava – దేశ గౌరవమే ప్రధానం
మారుతి సుజుకీ 44వ వార్షిక సర్వసభ్య సమావేశంలో (AGM) మాట్లాడిన భార్గవ, ట్రంప్ సుంకాలకు భారతదేశం లొంగకూడదని స్పష్టం చేశారు. “వాణిజ్యం కంటే దేశ గౌరవం, ప్రతిష్ట ముఖ్యమైనవి. ఈ కీలక సమయంలో దేశమంతా ఐక్యంగా నిలవాలి” అని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితికి అమెరికా విధానాలే కారణమని పేర్కొన్నారు.
దౌత్య సంబంధాల్లో సుంకాల వినియోగం
సుంకాలను దౌత్యంలో ఆయుధంగా ఉపయోగించిన తొలి నేత ట్రంపేనని భార్గవ విమర్శించారు. భారత్-బ్రిటన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) ఇతర దేశాలతో కుదుర్చుకునే ఒప్పందాలకు ఆదర్శంగా ఉండాలని సూచించారు. రేర్ ఎర్త్ మాగ్నెట్ల సరఫరాపై చైనా ఆంక్షలు ఒక హెచ్చరికగా పరిగణించాల్సిన అవసరముందని ఆయన వ్యాఖ్యానించారు.
చిన్న కార్లకు ఊరట వచ్చే అవకాశాలు
ప్రతిపాదిత GST సంస్కరణలపై కూడా భార్గవ స్పందించారు. ప్రస్తుతం చిన్న కార్లపై 28 శాతం పన్ను ఉండగా, దాన్ని 18 శాతం వరకు తగ్గించే అవకాశం ఉందని తెలిపారు. ఈ మార్పు జరిగితే GDP వృద్ధి రేటు పెరుగడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా విస్తరిస్తాయని ఆయన భావించారు.
GST తగ్గితే స్కూటర్లు, బైకులపై ఆధారపడుతున్న అనేక మంది వినియోగదారులు చిన్న కార్లు కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తారని పేర్కొన్నారు. జపాన్‌లో అమలైన మోడల్ ఈ విషయంలో భారతదేశానికి ఆదర్శంగా ఉంటుందని చెప్పారు.
Also Read : Today Gold Price : రోజురోజుకు పెరుగుతూ వస్తున్న పసిడి ధరలు



















