హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను జిల్లాల్లో సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్ పనులను వేగవంతం చేసి, భూ సేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారరు. అలాగే వేసవికాలంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు.
సీఎంఆర్ వ్యవహారంలో ధాన్యం రికవరీ, కేసుల పురోగతిపై ఏప్రిల్ 30 నాటికి సమగ్ర నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వివరాలను ఆధార్, బ్యాంక్ ఖాతాలకు అనుసంధానం చేసి ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా చూడాలని స్పష్టం చేశారు.
జిల్లాల్లో మాదక ద్రవ్యాల నియంత్రణ, ఇసుక అక్రమ రవాణా, మైనింగ్ అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగేలా తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలని స్పష్టం చేశారు.
ప్రజల నుంచి వచ్చే అర్జీలను 10–15 రోజుల్లో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని, సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు పారదర్శకంగా అందేలా సాంకేతికతను వినియోగించాలని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ప్రజా ప్రభుత్వ లక్ష్యాలను సాధించేందుకు అధికారులు నిబద్ధతతో పని చేయాలని సూచించారు. జిల్లాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో వేగం పెంచి ప్రజలకు ప్రభుత్వ సేవలు త్వరగా అందేలా కృషి చేయాలని అన్నారు.
















