అమరావతి : ఏపీ కూటమి సర్కార్ కీలక ప్రకటన చేసింది. వ్యవసాయ రంగంలో డ్రోన్ పైలట్లకు శిక్షణ ఇచ్చామని , మరికొందరికి త్వరలో ట్రైనింగ్ ఇప్పిస్తామన్నారు సంబంధిత శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. వేట నిషేధ కాల భృతిని కుటుంబానికి 10 వేలు నుండి 20 వేల రూపాయలకు పెంచి 1,21,433 కుటుంబాలకు 242.86 కోట్ల రూపాయలు విడుదల చేశామన్నారు. డీజిల్ సబ్సిడీగా 50 కోట్ల రూపాయలతో 21,574 పడవలకు లబ్ది చేకూరిందన్నారు. భద్రత కోసం 4,274 పడవలకు ట్రాన్స్‌పాండర్లు ఏర్పాటు చేసి 27,626 మత్స్యకారులకు రక్షణ కల్పించామని తెలిపారు. 2026-27లో మత్స్య రంగ అభివృద్ధికి మొత్తం 523.525 కోట్ల రూపాయిలను ప్రతిపాదించామని స్పష్టం చేశారు అచ్చెన్నాయుడు.
వ్యవసాయ డ్రోన్ పైలెట్ శిక్షణలో డి.జి.సి.ఎ. ధృవీకరణను పొందిన మొదటి వ్యవసాయ విశ్వ విద్యాలయంగా ఎన్ జీ రంగా యూనివర్శిటీ చరిత్ర సృష్టించిందన్నారు.. ఇప్పటి వరకు 534 మంది డ్రోన్ పైలెట్‌లకు శిక్షణ ఇచ్చామన్నారు. కుప్పం, బాపట్ల, పల్నాడు, విజయనగరంలో కొత్త కృషి విజ్ఞాన కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలను ఐ.సి.ఎ.ఆర్.కు పంపించాం అన్నారు. 2026-27లో ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కోసం రూ.504.11 కోట్లు బడ్జెట్ లో ప్రతిపాదించామని స్పష్టం చేశారు అచ్చెన్నాయుడు.

















