అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మత్స్యకారులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని తెలిపారు. రెండో సంవత్సరం కూడా వేట నిషేధ సమయంలో ఇచ్చే ఆర్థిక భృతిని విడుదల చేశామన్నారు. మత్స్యకారుల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనం అని పేర్కొన్నారు . బుధవారం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. మత్స్యకారుల సేవలో పథకం కింద అర్హులైన ప్రతి మత్స్యకార కుటుంబానికి రూ. 20 వేల చొప్పున ఆర్థిక సాయం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తున్నాం అన్నారు. గత ప్రభుత్వం రూ.10 వేలు మాత్రమే ఇవ్వగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ మొత్తాన్ని రెట్టింపు చేసి ఇస్తోందన్నారు పవన్ కళ్యాణ్. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 1.30 లక్షల మంది మత్స్యకారులకు లబ్ధి చేకూరనుందని పేర్కొన్నారు.
ఈ పథకం కోసం ప్రభుత్వం మొత్తం రూ.262 కోట్లు వ్యయం చేస్తోందని చెప్పారు. కాకినాడ జిల్లాలో 24,930 మంది లబ్ధిదారులకు రూ.49.86 కోట్ల మేర, పిఠాపురం నియోజకవర్గంలో 6,897 మంది లబ్ధిదారులకు రూ.13.79 కోట్ల మేర లబ్ధి చేకూరనుందని తెలిపారు డిప్యూటీ సీఎం. కాకినాడ జిల్లాలోని 119 కిలోమీటర్ల కోస్తా తీరం పరిధిలో ఉన్న 23 ల్యాండింగ్ సెంటర్లు, 51 మత్స్యకార గ్రామాల ప్రజలకు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్నో పథకాలు ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయని అన్నారు. 4,578 బోట్లకుగాను 91.48 లక్షల లీటర్ల డీజిల్‌పై ప్రభుత్వం రూ.8.23 కోట్ల రూపాయల సబ్సిడీని అందించినట్లు తెలిపారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, డిఆర్డీఏ సహకారంతో ఇంజన్లు, వలలు, బోట్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాల కొనుగోలుకు రూ.1.13 కోట్ల రూపాయల సబ్సిడీ అందించిందన్నారు.

















