తిరుమల : టీటీడీ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన ధర్మ రథాలు (బస్సులు) ప్రజాదరణ పొందుతున్నాయి. భక్తులకు విశిష్ట సేవలు అందిస్తున్నాయి. హైదరాబాద్ కు చెందిన బి.ఎస్.టెక్నోట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డిజిటల్ బోర్డులను విరాళంగా అందివ్వగా, ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ సంస్థ సాంకేతిక సహకారం అందిస్తోంది. ఈ విధానం అమలు చేసినప్పటి నుండి బస్టాప్ వద్దకు వచ్చిన భక్తులకు బస్సు వచ్చే సమయం ప్రత్యక్షంగా తెలియడం, 10 నిమిషాల లోపే బస్సులు రావడంతో భక్తులు ఉచిత బస్సు సేవలను విరివిగా వినియోగించు కుంటున్నారు. భక్తుల సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ సౌకర్యం ఎంతో ఉపయోగరంగా ఉందని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం ద్వారా ఇంధన వినియోగం తగ్గడంతో పాటు కాలుష్య నియంత్రణకు కూడా ఈ సౌకర్యం దోహదపడుతోంది. అదేవిధంగా తిరుమలలో వాహన రద్దీని తగ్గించి కాలుష్య నియంత్రణ దిశగా పటిష్టమైన ప్రజా రవాణా వ్యవస్థను ప్రోత్సహించడానికి, భక్తులకు సౌకర్యవంతమైన, పర్యావరణ హితమైన రవాణా అందించాలనే లక్ష్యంతో టీటీడీ ఈ విధానాన్ని మరింత విస్తృతంగా అమలు చేసే దిశగా చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం రాత్రి 9 నుండి ఉదయం 5 ఐదు గంటల వరకు ఈ ఎలక్ట్రిక్ బస్సులు 60 ట్రిప్పులు తిరుగుతుండగా భక్తుల సౌకర్యార్థం అదనంగా మరో 20 ట్రిప్పులను పెంచనున్నారు. అదే విధంగా రాబోయే రోజుల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా అదనంగా మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.


















