2 గంట‌ల లోపే వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం

నిర్దేశించిన స‌మ‌యానికి భ‌క్తులు రావాలి

hellotelugu-TTDEO

తిరుమ‌ల : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. వ‌రుస సెల‌వులు కావ‌డంతో భ‌క్తుల ర‌ద్దీ పెరిగింది తిరుమ‌ల‌కు. దీంతో కీల‌క సూచ‌న‌లు చేశారు శ్రీ‌వారి భ‌క్తుల‌కు. ఈ మేర‌కు పెరిగిన రద్దీకి అనుగుణంగా టీటీడీ నిర్ణయాలు తీసుకుంటోందని తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు జరగనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశామ‌ని పేర్కొన్నారు. ఇదే సమయంలో కొత్త సంవత్సరం కావటంతో భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు.

వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చే భక్తులకు ఆదివారం టీటీడీ ఈవో సింఘాల్ కీలక సూచనలు చేశారు. ఈ పది రోజులు కూడా పవిత్రమైనవేన‌ని పేర్కొన్నారు. వాటిలో ఏరోజు స్వామివారిని దర్శించుకున్నా ఒకే రకమైన ప్రతిఫలం లభిస్తుందని సింఘాల్ చెప్పారు. వైకుంఠ ద్వార దర్శనాల కోసం మొదటిసారి ఈ-డిప్‌ విధానాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. మొదటి మూడు రోజుల దర్శనాలకు గాను దేశ వ్యాప్తంగా 1,89,000 మంది భక్తులకు పూర్తి పారదర్శక విధానంలో టోకెన్లు జారీ చేశామని తెలిపారు. టోకెన్లు పొందిన వారు నిర్దేశిత సమయం లోపు తిరుమలకు చేరుకుంటే రెండు గంటల్లోనే శ్రీవారి దర్శనాన్ని పూర్తిగా చేయిస్తామని సింఘాల్ స్ప‌ష్టం చేశారు.

ఇదిలా ఉండ‌గా కొంద‌రు కావాల‌ని దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని, భ‌క్తుల‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తున్నారంటూ వ‌స్తున్న వదంతుల‌ను, వార్త‌ల‌ను న‌మ్మ వ‌ద్ద‌ని కోరారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. ఏ ఒక్క భ‌క్తుడికీ ఇబ్బంది లేకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేశామ‌న్నారు. టీటీడీకి స‌హ‌క‌రించాల‌ని కోరారు.

Exit mobile version