అమరావతి : రాష్ట్రంలో భూ సమస్యలను లేకుండా చేసేందుకు ప్రభుత్వం పని చేస్తోందని, 2027 మార్చి నాటికి 1.12 కోట్ల పట్టదారు పాసుపుస్తకాలను పంపిణీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఒక్క రూపాయి కూడా అవినీతికి తావు లేకుండా పాసు పుస్తకాలు అందింస్తున్నామని తెలిపారు. ఆటో మ్యుటేషన్ తర్వాత నేరుగా ఇంటికి పాస్ పుస్తకాలను పంపాలని అధికారులను ఆదేశించారు. వేదికపై రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను అందించారు. వారి సమక్షంలోనే పొలం వివరాలను అధికారులతో చదివి వినిపించారు . అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగించారు. గత పభుత్వంలో ప్రజల భూమిపై కన్నేసి కబ్జాలు చేశారని ఆరోపించారు. ప్రశ్నించిన వారిని కట్టడి చేసేందుకు బ్లాక్ మెయిల్ చేశారన్నారు. రికార్డులు తారుమారు చేశారంటూ మండిపడ్డారు సీఎం. ప్రతీ గ్రామంలో, ప్రతి ఇంటిలో భూ వివాదాలకు తెరలేపి భయానక వాతావరణం సృష్టించారని అన్నారు.
పట్టాదారు పాస్ పుస్తకాలపైనా జగన్ తన ఫోటో వేసుకున్నాడు. సరిహద్దు రాళ్లపైనా బొమ్మలు చెక్కించుకున్నాడు. ఇందుకోసం వందల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆరోపించారు చంద్రబాబు నాయుడు. వారు అధికారం నుంచి దిగిపోయినా పాపాలు, అక్రమాలు ఇంకా వెంటాడుతున్నాయన్నారు. అంతలా రెవెన్యూ వ్యవస్థను నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆస్తులకు భద్రత, ప్రజల జీవితాలకు భరోసా ఇవ్వాలనే లక్ష్యంతో ప్రతీ నెల తాను స్వయంగా పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తున్నానని చెప్పారు. భూమి అనేది ఆస్తి మాత్రమే కాదు. భద్రత, జీవనాధారం. అర్జీల్లో రెవెన్యూ సమస్యలవే ఎక్కువగా ఉంటున్నాయన్నారు.
అందుకే భూ సమస్యలు శాశ్వతంగా పరిష్కరించాలని సంకల్పించాం అని చెప్పారు సీఎం. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం కోసం రీ సర్వే 2.0 చేపట్టాం అన్నారు. రాష్ట్రంలో మొత్తం 16,816 గ్రామాల్లో రీ సర్వే చేయాల్సి ఉండగా, ఇప్పటికే 6,976 గ్రామాల్లో పూర్తి చేశామని తెలిపారు.. 2027 మార్చి నాటికి రీ సర్వే పూర్తి చేసి ప్రతి ఒక్కరికి రాజముద్రతో కొత్త పాసుపుస్తకాలు ఇస్తాం అన్నారు. ఈ జనవరి నుంచి మార్చి వరకు 21.23 లక్షల కొత్త పాసుపుస్తకాలు ఇచ్చామన్నారు. ఈ నెలలో 356 గ్రామాల్లో 1,56,433 పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నాం. జూలై నాటికి మరో 9 లక్షల పట్టాదారు పుస్తకాలు ఇస్తాం. 11,099 గ్రామాల్లో కొత్తగా ఇవ్వాల్సిన 80 లక్షలు పాస్ పుస్తకాలను వచ్చే ఏడాది మార్చి నాటికి పంపిణీ చేస్తాం. 1.10 కోటి మందికి పాస్ పుస్తకాలు ప్రజలకు అందిస్తాం.















