హైదరాబాద్ : నితేష్ తివారీ దర్శకత్వంలో రాబోతున్న ‘రామాయణ: రైజ్ ఆఫ్ ఏ లెజెండ్’ చిత్రంలోని పాటలపై ఆన్లైన్లో వస్తున్న విమర్శలకు ఆస్కార్ పురస్కార గ్రహీత, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్పందించారు. ఇటీవల విడుదలైన ‘మంగళ్ రంగ్’ పాట సోషల్ మీడియాలో చర్చలకు దారితీయగా అంతకు ముందు విడుదలైన ‘రావణ తాండవ్’ పాటకు కూడా శ్రోతల నుండి మిశ్రమ స్పందన లభించింది. సంగీతం మొదట విడుదలైనప్పుడు ప్రజలు కొన్నిసార్లు విమర్శిస్తారని, కానీ దాన్ని మళ్లీ విన్న తర్వాత తమ అభిప్రాయాలను మార్చుకుంటారని రెహమాన్ అన్నారు. సంగీతాన్ని సృష్టించడానికి విస్తృతమైన పరిశోధన, కఠోర శ్రమ , ప్రయోగాలు అవసరమని, అందుకే తాను ఆన్లైన్ వ్యాఖ్యలను చదవడానికి ఎక్కువ సమయం కేటాయించనని స్పష్టం చేశారు.
శ్రోతలకు సంగీతాన్ని అందించే ముందు, దానిని రూపొందించడానికి తన బృందం ఎంతో కృషి చేస్తుందని రెహమాన్ వివరించారు. సోషల్ మీడియాలో స్పందనల కోసం వెతకడం కంటే తన పనిపై దృష్టి పెట్టడానికే తాను ప్రాధాన్యత ఇస్తానని ఆయన అన్నారు. తనను గతంలో విమర్శించిన వారే ఆ తర్వాత క్షమాపణలు చెప్పడానికి తిరిగి వస్తారని తన కుమారుడు అప్పుడప్పుడు చెబుతుంటాడని సంగీత దర్శకుడు పంచుకున్నారు. తాను నిజాయితీగా పనిచేస్తూనే ఉంటానని, తన సంగీతాన్ని ప్రేక్షకులు ఆస్వాదిస్తారని ఆశిస్తున్నానని రెహమాన్ అన్నారు.
‘రావణ తాండవ్’ విడుదలైన వెంటనే ప్రతికూల వ్యాఖ్యలను ఎలా ఎదుర్కొందో కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. అయితే ఆ తర్వాత కొంతమంది శ్రోతలు ఆ స్వరకల్పనలోని లోతును ప్రశంసించడం ప్రారంభించారు. రెహమాన్ ప్రకారం సంగీతాన్ని ఆన్లైన్లో వచ్చే తక్షణ స్పందనల ద్వారా కాకుండా, విశాల దృక్పథంతో అంచనా వేయాలని సూచించారు సంగీత దర్శకుడు. తన సుదీర్ఘ సంగీత ప్రస్థానంలో రామాయణం వంటి పౌరాణిక కథపై పనిచేయడం ఒక ప్రత్యేక బాధ్యత అని రెహమాన్ అన్నారు. రోజా, బాంబే వంటి చిత్రాలకు తాను స్వరపరిచిన తరహా సంగీతాన్ని పునః సృష్టించమని ప్రజలు తరచుగా తనను అడిగేవారని ఆయన వివరించారు.
