హైదరాబాద్ : హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ట్రాన్స్ జెండర్స్ కు. సమాజంలో గౌరవ ప్రదంగా జీవించాలని హితవు పలికారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ.. బలవంతపు వసూళ్లకు పాల్పడితే చట్ట పరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలను వీడి, ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు
హైదరాబాద్ అమీర్ పేటలోని సెంటర్ పర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) ఆడిటోరియంలో 250 మంది ట్రాన్స్ జెండర్లతో హైదరాబాద్ సిటీ పోలీసులు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీఐడీ, మహిళా భద్రతా విభాగ అదనపు డీజీపీ చారు సిన్హా పాల్గొన్నారు. వారు నేరుగా ట్రాన్స్ జెండర్లతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్బంగా నగర సీపీ సజ్జనర్ మాట్లాడుతూ.. ట్రాన్స్‌జెండర్ల మధ్య గ్రూపు తగాదాలు, ఆధిపత్య పోరు తరచూ శాంతి భద్రతల సమస్యలకు, ప్రాణ నష్టానికి కారణం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మధ్య ట్రాన్స్ జెండర్లపై ప్రజల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. శుభకార్యాల పేరుతో ఇళ్లపై పడి యజమానులను వేధించడం సరికాదన్నారు. ఇలాంటి బలవంతపు వసూళ్లను సహించం అని హెచ్చరించారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఎంతటి వారినైనా కటకటాల వెనక్కి పంపిస్తాం అన్నారు. మీపై నమోదయ్యే కేసులు మీ భవిష్యత్తును నాశనం చేస్తాయన్నారు. అమాయక ప్రజలను ఇబ్బంది పెడితే జైలు శిక్షలు తప్పవు అని, జాగ్రత్తగా ఉండాలన్నారు.

















