చెన్నై : తమిళ చలన చిత్ర పరిశ్రమకు చెందని ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ విజయ్ తన ఆస్తుల విలువను ప్రకటించారు. రాష్ట్రంలో శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా తాను పెరంబూరు నుండి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్బంగా ఎన్నికల అధికారికి సమర్పించిన అఫిడవిట్ లో తన ఆస్తుల విలువ రూ. 640.50 కోట్లు అని ప్రకటించారు. నామినేషన్ అనంతరం మీడియాతో మాట్లాడాడు విజయ్. ఏప్రిల్ 23న జరిగే ఎన్నికల్లో తమ పార్టీ గుర్తు అయిన ‘ఈల’ గుర్తుకు ఓటు వేసి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని తమకు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మొత్తం ఆస్తులు రూ. 640 కోట్లు కాగా ఇందులో చరాస్తుల విలువ రూ. 420.10 కోట్లు గా ఉందని, స్థిరాస్తుల విలువ రూ. 220.40 కోట్లుగా ఉందని వెల్లడించారు.
ఆయన చరాస్తులలో, రూ. 404.58 కోట్లు తన పేరు మీద, రూ. 15.51 కోట్లు తన భార్య సంగీత పేరు మీద ఉన్నట్లు ప్రకటించారు. రూ. 220.40 కోట్ల విలువైన స్థిరాస్తులలో, రూ. 220.15 కోట్లు తన పేరు మీద, రూ. 25 లక్షలు తన భార్య పేరు మీద ఉన్నట్లు చూపించారు. తన ప్రచార రథం పైనుండి ప్రసంగించిన విజయ్, అధికారంలో ఉన్న డీఎంకే పార్టీని ఓ దుష్ట శక్తి అని సంచలన ఆరోపణలు చేశారు. ఆయన పదే పదే డీఎంకేను లక్ష్యంగా చేసుకున్నారు. మనం ఇప్పుడు మేల్కోవాల్సిన సమయం వచ్చిందన్నారు. లేకపోతే ఇక అధోగతే అని హెచ్చరించారు విజయ్.

















