చేయూత పథకం కింద పెన్ష‌న్ల‌ కోసం దరఖాస్తుల స్వీకరణ

అర్హతా ప్రమాణాలలో ఎలాంటి మార్పులు లేవు

helloteelugu-Cheyutha

హైద‌రాబాద్ : అర్హులైన పేద, బలహీన వర్గాలకు సామాజిక భద్రత కల్పించాలనే ఏకైక లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేయూత సామాజిక భద్రతా పింఛన్ పథకం కింద కొత్త పింఛన్లను మంజూరు చేసేందుకు చర్యలు ప్రారంభించింది. మొదటి దశలో ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, కల్లు గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియాసిస్ రోగులు, తలసేమియా, సికిల్ సెల్ వ్యాధి, హీమోఫిలియా , ఇతర రక్త సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్న వారికి కొత్త పింఛన్లు మంజూరు చేయనున్న‌ట్లు తెలిపింది. కొత్త పింఛన్ల అర్హతా ప్రమాణాలలో ఎలాంటి మార్పులు చేయలేదని స్ప‌ష్టం చేసింది స‌ర్కార్. గత ప్రభుత్వాల హయాంలో జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులలో పేర్కొన్న అర్హతా ప్రమాణాలనే ప్రస్తుత ప్రభుత్వం కూడా అధికారికంగా అనుసరిస్తోందని తెలిపింది.. 2014, 2018 మధ్య జారీ చేయబడిన సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వులలోని నిబంధనల ఆధారంగా అర్హతను నిర్ధారించడం జరుగుతుందని పేర్కొంది.

ప్రజా పాలన ఉత్సవాలు, 99 రోజుల ప్రగతి ప్రణాళిక గ్రామ సభలు , ప్రజా వాణి ద్వారా ఇప్పటికే అందిన దరఖాస్తులను కూడా పరిగణనలోకి తీసుకోవ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపింది. గతంలో దరఖాస్తు చేసుకుని, అవసరమైన అన్ని పత్రాలను సమర్పించిన వారు తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని నొక్కి చెప్పింది. అవసరమైన పత్రాలను సమర్పించని లేదా ఇంకా దరఖాస్తు చేసుకోని అర్హులైన వ్యక్తులు కొత్త దరఖాస్తులను సమర్పించేందుకు ఛాన్స్ ఇచ్చామ‌ని స్ప‌ష్టం చేసింది. అర్హత నిర్ధారణ కోసం సంబంధిత శాఖల నుండి అవసరమైన ధృవీకరణ పత్రాలను పొందేందుకు జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకుంటారు. వితంతువులకు భర్త మరణ ధృవీకరణ పత్రం, ఒంటరి మహిళలకు విడాకుల ధృవీకరణ పత్రం లేదా స్థానిక విచారణ నివేదిక, కల్లు గీత కార్మికులకు ఎక్సైజ్ శాఖ నుండి, చేనేత కార్మికులకు చేనేత శాఖ నుండి , ఫైలేరియా రోగులకు వైద్య , ఆరోగ్య శాఖ నుండి ధృవీకరణ అవసరం అని పేర్కొంది. దరఖాస్తులను సమీక్షించిన తర్వాత, నియమించబడిన అధికారులు క్షేత్రస్థాయిలో అర్హతను ధృవీకరిస్తారు. తదనంతరం అర్హులైన వ్యక్తుల జాబితాను జిల్లా స్థాయికి పంపించి, జిల్లా కలెక్టర్ ఆమోదంతో పింఛను మంజూరు ప్రక్రియను పూర్తి చేయడం జరుగుతుంది.

Exit mobile version