Y V S Chowdary: నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. లెజండరీ నటుడు ఎన్టీఆర్ ని దైవంగా భావించే దర్శకుడు వైవిఎస్ చౌదరి ఇప్పుడు నాలుగో తరం నందమూరి వంశానికి చెందిన నందమూరి తారక రామారావు తన సినిమా ద్వారా పరిచయం చేస్తున్నారు. ఇదే విషయాన్ని దర్శకుడు వైవీఎస్ చౌదరి అధికారికంగా ప్రకటించారు. ‘సీనియర్ ఎన్టీఆర్ మునిమనవడు.. హరికృష్ణ మనవడు.. దివంగత జానకిరామ్ పెద్ద కుమారుడు నందమూరి తారక రామారావును నేను ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నందుకు గర్వంగా ఉంది. హరికృష్ణతో సినిమాలు తీసే అదృష్టం నాకు దక్కింది. ఇప్పుడు ఆయన మనవడిని కూడా ప్రపంచానికి పరిచయం చేయబోతున్నా’ అని వైవిఎస్ చౌదరి ఆనందం వ్యక్తం చేశారు. దీనితో నందమూరి అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. దివంగత సీనియర్ ఎన్టీఆర్ కుటుంబం నుండి నాలుగోతరం హీరోగా వస్తున్న నందరమూరి తారక రామారావును సినిమా ఇండస్ట్రీలోనికి సాదరంగా ఆహ్వానిస్తున్నారు.
Y V S Chowdary….
వైవీఎస్ చౌదరి భార్య గీత నిర్మాతగా న్యూ టాలెంట్ రోర్స్ అనే కొత్త బ్యానర్‌ను వైవీఎస్(Y V S Chowdary) ప్రారంభించారు. ఈ బ్యానర్‌పై రానున్న తొలి సినిమాతోనే నందమూరి ఫ్యామిలీ నుంచి నాలుగోతరం హీరోను పరిచయం చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను వెల్లడించనున్నారు. ఇందులో తెలుగుఅమ్మాయిని హీరోయిన్‌గా తీసుకోనున్నట్లు సమాచారం. మరో ఈవెంట్ పెట్టి హీరో హీరోయిన్లను పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది.
నందమూరి తారకరామారావు సినిమాలు చూస్తూ పెరిగిన వైవిఎస్ అతనిపైన వున్న అభిమానంతో, ఎన్టీఆర్ రూపంచూసి ఆకర్షితుడై, చిత్ర రంగంలోకి అడుగు పెట్టారు. మొదటిసారిగా దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు దగ్గర నందమూరి బాలకృష్ణ సినిమాకి పనిచెయ్యడం, ఆ తరువాత తన స్వయంకృషితో, పట్టుదలతో, అంకిత భావంతో దర్శకుడిగా ‘శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి’ అనే సినిమాతో పరిచయం అవటం జరిగింది. ఆ తరువాత వైవిఎస్ ఎన్నో విజవంతమైన సినిమాలకి దర్శకత్వం వహించారు. ‘సీతా రాముల కల్యాణం చూదము రారండి’ మొదలుకొని ‘యువరాజు’, ‘లాహిరి లాహిరి లాహిరిలో’, ‘సీతయ్య’, ‘దేవదాస్’.. వంటి ఎన్నో హిట్ సినిమాలు తెరకెక్కించారు దర్శకుడు వైవిఎస్ చౌదరి. చివరిగా ‘రేయ్’తో పలకరించారు. తొమ్మిదేళ్ల విరామం తర్వాత ఇప్పుడీ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు.
వైవిఎస్(Y V S Chowdary) చివరి సినిమా ‘రేయ్’, సాయి ధరమ్ తేజ్ కథానాయకుడు, సయామీ ఖేర్ కథానాయిక. ఈ ఇద్దరినీ ఆ సినిమాతో పరిచయం చేశారు. ఇంతకుముందు కూడా తన సినిమాలలో ఎక్కువగా కొత్తవారిని పరిచయం చేశారు వైవిఎస్ చౌదరి. ఆలా పరిచయం అయిన వారే రామ్ పోతినేని, ఇలియానా, అంకిత, ఆదిత్య ఓం. అంతే కాదు తన నిర్మాణ సంస్థ పేరు కూడా బొమ్మరిల్లు అని పెట్టి, దానికి తన ఆరాధ్య దైవం ఎన్టీఆర్ బొమ్మని ఎప్పుడూ వాడతారు వైవిఎస్.
Also Read : Darshan Thoogudeepa: మర్డర్ కేసులో కన్నడ హీరో అరెస్టు !