Vijay Sethupathi: స్టార్ హీరోలు చేసిన సినిమాల సంఖ్య తక్కువ అయినా… వారు వినే కథల సంఖ్య ఎక్కువ ఉంటుంది. మంచి కథ, దర్శకుడు, నిర్మాతలతో పాటు ఇతర తారాగాణం దొరికే వరకు కథలను వింటూనే ఉంటారు. చివరకు ఏదో ఒక కథ వద్ద లాక్ అవుతుంటారు. ఈ కోవలోనే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కూడా ఉన్నారు. ఒకవైపు కథానాయకుడిగా నటిస్తూనే… మరోవైపు అగ్ర తారల సినిమాల్లో కీలక పాత్రల్లో ఒదిగిపోతున్న విజయ్ సేతుపతి(Vijay Sethupathi)… తెలుగు, తమిళం, హిందీ… అని తేడా లేకుండా పాన్ ఇండియా వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవలే విజయ్ సేతుపతి నటించిన 50వ సినిమాగా తెరకెక్కించిన ‘మహారాజ’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నితిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన ఆ చిత్రం ఎస్వీఆర్ సినిమా పతాకంపై ఈ నెల 14న తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా విజయ్ సేతుపతి(Vijay Sethupathi) బుధవారం విలేకర్లతో ముచ్చటించారు.
Vijay Sethupathi…
ఈ సందర్భంగా విజయ్ సేతుపతి మాట్లాడుతూ… ప్రత్యేకంగా ఇది నా 50వ సినిమాగా ఉండాలని ఎంచుకుని చేసిన కథే ఇది. విన్నప్పుడే ఎంతో ఆసక్తికరంగా అనిపించింది. కథ కంటే కథనం నన్నెంతగానో ప్రభావితం చేసింది. ‘పిజ్జా’ సినిమాని గుర్తు చేసింది. అంత ఆసక్తికరమైన మలుపులు ఇందులో ఉంటాయి. దర్శకుడు ఈ కథ చెప్పిన వెంటనే నా యాభయ్యో సినిమా ఇదే అని ప్రకటించాం. విడుదలైన నా సినిమాలు 50 మాత్రమే కావొచ్చు. కానీ నేను 500 కంటే ఎక్కువ కథలు విన్నా. ఎంతో మందిని కలిశా. విజయాలు చూశా, పరాజయాలూ చూశా. ప్రతి ఫలితం తర్వాత ఏం జరిగిందో ఆలోచిస్తాం కదా. అలా ఎంతో అనుభవాన్ని సంపాదించా. ఇదొక గొప్ప ప్రయాణం. గతాన్ని మోసుకుంటూ ప్రయాణం చేయడం నాకు ఇష్టం ఉండదు. ఇదివరకటిలాగే ఇకముందు కూడా నా కెరీర్ కొనసాగుతుంది. కలలు, అంచనాలు ఎప్పుడూ భారమే. అందుకే రోజూ కెమెరా ముందుకు కొత్తగా వెళతాను. సినిమా విషయంలో అదే రకమైన థ్రిల్‌తో ఉంటా. ఇకపైనా ఇంతే బాధ్యతతో పనిచేయడమే నా వ్యూహం అని అన్నారు.
Also Read : Jr NTR-Devara : ఎన్టీఆర్ దేవర సినిమా రిలీజ్ ను మరోసారి మార్చిన చిత్రబృందం