Tillu Square: సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా బ్లాక్ బస్టర్ ‘టిల్లు స్క్వేర్(Tillu Square)’. డీజే టిల్లకు సీక్వెల్ గా మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా రూ. 125 కోట్లు వసూలు చేసింది. దీనితో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం సినీ ప్రియులందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నెట్‌ఫ్లిక్స్ ‘టిల్లు స్క్వేర్’ స్ట్రీమింగ్ డేట్ ను ప్రకటించింది. ఏప్రిల్ 26 నుంచి తెలుగుతోపాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుందని తెలిపింది. ‘‘హిస్టరీ రిపీట్ కావడం సాధారణం. అదే, టిల్లు వస్తే హిస్టరీ, మిస్టరీ, కెమిస్ట్రీ అన్నీ రిపీట్ అవుతాయి. అట్లుంటది టిల్లన్నతోని’’ అని పోస్ట్ పెట్టింది.
2022లో విడుదలైన ‘డీజే టిల్లు’ చిత్రానికి కొనసాగింపుగా ‘టిల్లు స్క్వేర్(Tillu Square)’ సిద్ధమైన విషయం తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ దీనిని నిర్మించారు. రొమాంటిక్ క్రైమ్ కామెడీ కథాంశంతో ఇది రూపుదిద్దుకుంది. మార్చి నెలాఖరున విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. సిద్ధు జొన్నలగడ్డ యాక్టింగ్, అనుపమ అందాలు ప్రేక్షకులను అలరించాయి.
Tillu Square- ‘టిల్లు స్క్వేర్’ కథేమిటంటే ?
రాధిక (నేహాశెట్టి)తో పాత పంచాయితీ ముగిశాక టిల్లు (సిద్ధు జొన్నలగడ్డ) సొంతంగా ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ప్రారంభిస్తాడు. పాత గొడవలన్నీ మర్చిపోయి మళ్లీ తనదైన శైలిలో సరదాగా ఉండేందుకు ప్రయత్నం చేస్తుంటాడు. సరిగ్గా అప్పుడే అతని జీవితంలోకి లిల్లీ (అనుపమ పరమేశ్వరన్) అనే మరో అందమైన అమ్మాయి ప్రవేశిస్తుంది. వాళ్లిద్దరూ అనుకోకుండా ఓ పబ్‌లో కలుసుకుంటారు. ముందు టిల్లు ఆమెతో మాట కలుపుతాడు. అతడి వ్యవహారశైలి నచ్చి ఆమె తనతో పెదవి కలుపుతుంది. అంతే.. అదే రాత్రి ఇద్దరూ ఒక్కటవుతారు. కట్ చేస్తే తెల్లారేసరికి గదిలో ఒక లెటర్ పెట్టి లిల్లీ అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. కానీ, ఆ ఒక్క పూటలోనే ఆమెను మనసంతా నింపేసుకున్న టిల్లు ఆ ఆలోచనలతో పిచ్చివాడైపోతాడు. ఆమెను వెతికి పట్టుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తాడు.
ఈ క్రమంలో నెల తర్వాత లిల్లీ ఓ ఆస్పత్రిలో టిల్లుకు ఎదురుపడుతుంది. తను గర్భవతినని చెప్పడంతో అతడు షాకవుతాడు. ఆ తర్వాత తనని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇంటికి తీసుకొస్తాడు. ఈలోపు మళ్లీ టిల్లు పుట్టినరోజు వస్తుంది. ఆరోజు లిల్లీ అతన్ని తన అపార్ట్‌మెంట్‌కు రావాలని కోరడంతో అక్కడికి వెళ్తాడు. తీరా చూస్తే అది రాధిక (నేహా శెట్టి) ఫ్లాట్. మరి అక్కడికి వెళ్లాక టిల్లుకు ఎదురైన సమస్య ఏంటి ? రాధిక, లిల్లీకి మధ్య ఉన్న సంబంధం ఏంటి ? దుబాయ్ నుంచి వస్తున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ షేక్ మహబూబ్ (మురళీశర్మ)కు ఈ కథకు ఉన్న లింకేంటి ? అతన్ని చంపాల్సిన మిషన్‌లోకి టిల్లు ఎందుకొచ్చాడు ? అన్నది మిగతా కథ.
Also Read : Sandeep Reddy Vanga : బాలీవుడ్ నటుడిపై సందీప్ వంగా కీలక వ్యాఖ్యలు