Tamil Producers Council: తమిళ చలన చిత్ర నిర్మాతల మండలి సంచలన నిర్ణయాలు తీసుకుంది. అడ్వాన్స్ లు తీసుకొని పూర్తి చేయని నటీనటులపై యాక్షన్ తీసుకోవడానికి నిర్మాతల మండలి పలు నిర్ణయాలను తీసుకోనున్నట్లు ప్రకటించింది. తమిళ సినీ నిర్మాతల మండలి(Tamil Producers Council) అధ్యక్షతన రాష్ట్ర సినిమా థియేటర్ల యజమానుల సంఘం, రాష్ట్ర సినిమా థియేటర్ల మల్టీఫ్లెక్స్ యజమానుల సంఘం, రాష్ట్ర సినిమా పంపిణీదారుల సంఘం నిర్వాహకుల సమావేశం చెన్నైలో సోమవారం జరిగింది.
ఇందులో ఆరు తీర్మానాలు చేశారు. అగ్రనటుల సినిమాలు విడుదలైన 8 వారాలు తర్వాతే వాటిని ఓటీటీలో విడుదల చేయాలని, నటీనటులు, సాంకేతిక కళాకారులు అడ్వాన్స్ తీసుకున్న నిర్మాత చిత్రాన్ని ముందుగా పూర్తిచేసిన తర్వాతే ఇతర చిత్రాల్లో నటించాలని సూచించారు. ఈ మేరకు ఆగస్ట్ 15 తర్వాత కొత్త సినిమా షూటింగ్స్ నిలిపివేయాలని నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుంది. సెట్స్ మీదకు వెళ్లి పెండింగ్‌లో ఉన్న సినిమాలు పూర్తి చేసిన తరువాతే కొత్త సినిమాల షూటింగ్స్ మొదలుపెట్టాలనే రూల్ తీసుకొచ్చింది. ఇప్పటికే షూటింగ్ పెండింగ్, ఇచ్చిన అడ్వాన్స్‌ల పై నిర్మాతలను నిర్మాతల మండలి(Tamil Producers Council) నివేదిక అడిగింది.
Tamil Producers Council…
ఇక నుంచి ఒక సినిమా పూర్తయ్యాకే మరో సినిమాకు కాల్ షిట్ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇకపై ఏ హీరోహీరోయిన్ కూడా అడ్వాన్స్ తీసుకోవడం నిషేధం అని వెల్లడించింది. నటుడు ధనుష్ తీరుపై నిర్మాతల మండలి ఆగ్రహం వ్యక్తం చేస్తోందని తెలిసింది. అడ్వాన్స్ తీసుకొని షూటింగ్స్ పూర్తి చేయడం లేదని ఇప్పటికే ధనుష్‌పై ఫిర్యాదులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నటుడు ధనుష్ ఇకపై ఆయనతో సినిమాలు చేసే నిర్మాతలు ఆ ప్రాజెక్టు పనులు ప్రారంభించడానికి ముందు రాష్ట్ర సినీ నిర్మాతల సంఘంతో చర్చించాలని తీర్మానించారు.అంతేకాదు ఇకపై ధనుష్ సినిమా అంగీకరించాలంటే నిర్మాతల మండలి అనుమతి ఉండాల్సిందేనని తేల్చిచెప్పినట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే తమిళ చిత్ర పరిశ్రమ భారీ మార్పునకే శ్రీకారం చుట్టినట్లు కనిపిస్తోంది.
ప్రస్తుతం పలు సినిమాల విడుదలకు థియేటర్లు లభించని పరిస్థితుల్లో రూపొందించిన కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వచ్చిన తర్వాతే చిత్రీకరణ పనులు ప్రారంభించాలని తీర్మానించారు. దీని దృష్ట్యా ఆగస్టు 16 నుంచి కొత్త సినిమాల ప్రారంభోత్సవాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ… ప్రస్తుతం జరుగుతున్న కొన్ని చిత్రాల షూటింగ్ పనులను అక్టోబరు 30వ తేదీలోపు పూర్తి చేయాలని తెలిపారు. నటీనటులు, సాంకేతిక కళాకారుల వేతనాలు, ఇతర ఖర్చుల నియంత్రణ దృష్ట్యా కొత్త మార్గదర్శకాలు రూపొందించనున్న నేపథ్యంలో నవంబరు 1 నుంచి అన్ని సినిమాల చిత్రీకరణలకు సంబంధించిన పనులను నిలిపివేయాలని తీర్మానించారు. భవిష్యత్తులో సినీరంగానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల ఉమ్మడి కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేసినట్టు నిర్మాతల మండలి వెల్లడించింది.
Also Read : Madhu Bala : మంచు విష్ణు ‘కన్నప్ప’ నుండి మధుబాల ఫస్ట్ లుక్ రిలీజ్ !