Taal: ‘తాల్‌’ సినిమాకు 25 ఏళ్ళు ఆసక్తికర విషయాలను వెల్లడించిన అనిల్ కపూర్ !

‘తాల్‌’ సినిమాకు 25 ఏళ్ళు ఆసక్తికర విషయాలను వెల్లడించిన అనిల్ కపూర్ !

Hello Telugu - Taal

Taal: 90వ దశకం చివరిలో బాలీవుడ్‌ తో పాటు భారతీయ చలనచిత్ర ప్రేక్షకులను విశేషంగా అలరించిన చిత్రం ‘తాల్‌’. అనిల్‌ కపూర్‌, అక్షయ్‌ ఖన్నా, ఐశ్వర్య రాయ్‌ కీలక పాత్రల్లో రూపొందిన ఈ చిత్రానికి సుభాష్‌ ఘాయ్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు ఏఆర్‌ రెహమాన్‌ అందించిన పాటలు అప్పటి యూత్‌ ను ఉర్రూతలూగించాయి. ఆ మ్యూజికల్‌ హిట్‌ విడుదలై నేటితో 25 వసంతాలు పూర్తి చేసుకుంది. ‘తాల్‌’(Taal) సినిమా విడుదలై 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కీలక పాత్ర పోషించిన అనిల్‌ కపూర్‌ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఈ సందర్భంగా అనిల్ కపూర్ మాట్లాడుతూ… ‘‘ఇప్పటికీ ప్రేక్షకులు గుర్తు చేసుకునే ‘తాల్‌(Taal)’లాంటి అద్భుతమైన చిత్రంలో భాగస్వామిని అయినందుకు నాకెంతో గర్వంగా ఉంది. నా కెరీర్‌లో ఇదొక మైలురాయి. నన్ను నమ్మి సుభాష్ ఘాయ్‌ నాకు ‘విక్రాంత్’ పాత్రను ఇచ్చినందుకు నేను ఆయనకు ఎప్పటికీ రుణ పడి ఉంటాను. ఈ చిత్రంలో నాకు ఇష్టమైన పాటల్లో ‘ఒయ్‌ రమ్తా జోగి హోయూ’ ఒకటి. ఎందుకంటే… దానివెనుకో కథ ఉంది. ఆ పాట కొరియోగ్రఫీ చేయడానికి ముందుగా ఫరాఖాన్‌ని ఎంపిక చేశారు. కానీ, చివరి నిమిషంలో ఆమె స్థానంలో సరోజ్‌ ఖాన్‌ వచ్చారు. ఆమె గొప్ప నృత్య దర్శకురాలు. తెల్లవారితే సాంగ్‌ షూట్‌ చేయాలి. ఒక నటుడిగా ఎప్పుడూ చాలా ఆసక్తితో ఉండేవాడిని. దీంతో ఎలాంటి రిహార్సల్‌ చేయకుండానే ఆ పాటకి డ్యాన్స్ చేశా. పైగా ఐశ్వర్యరాయ్‌లాంటి అద్భుతమైన డ్యాన్సర్‌ తో స్క్రీన్‌ షేర్ చేసుకోవడం చాలా థ్రిల్‌ అనిపించింది. అన్నిటికీ మించి ‘తాల్‌(Taal)’ చిత్రానికి గానూ ఆ ఏడాది ఉత్తమ సహాయనటుడిగా అవార్డు అందుకున్నా’’ అంటూ తను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు అనిల్‌.

Taal – ‘తాల్‌’ కథేమిటంటే ?

జగ్‌మోహన్‌ (అమ్రిష్‌పురి) పెద్ద బిజినెస్‌మెన్‌. కుమారుడు మానవ్ (అక్షయ్‌ ఖన్నా) సహా కుటుంబమంతా చంబాకు వస్తుంది. అక్కడ సంగీత ఉపాధ్యాయుని కుమార్తె మాన్సీ (ఐశ్వర్య రాయ్‌)తో మానవ్‌ ప్రేమలో పడతాడు. వీరి ప్రేమని జగ్‌ మోహన్‌ ఒప్పుకోడు. తమ హోదాకు సరిపడదని మాన్సీని మానవ్ కుటుంబం అవమానిస్తుంది. ఇంతలో మాన్సీ సంగీత దర్శకుడు విక్రాంత్‌ (అనిల్‌కపూర్‌)ని కలుసుకుంటుంది. అతని ప్రొడక్షన్‌లో పాటలు, డ్యాన్స్‌ చేయడానికి ఒప్పుకొంటూ అగ్రిమెంట్‌పై సంతకం చేస్తుంది. ఈ క్రమంలో ఆమె సెలబ్రిటీగా మారుతుంది. మాన్సీని తన కుటుంబం అవమానించిన విషయం ఆలస్యంగా తెలుసుకున్న మానవ్‌ ఆమెకు క్షమాపణ చెప్పాలని ముంబయికి వస్తాడు. అయితే, మాన్సీ అతడిని కలవడానికి నిరాకరిస్తుంది. మానవ్‌, మాన్సీలు గతంలో ప్రేమించుకున్నారన్న విషయం తెలిసినా, ఆమెపై తనకున్న ప్రేమను విక్రాంత్‌ వ్యక్తం చేశాడు. మరి విక్రాంత్‌ ప్రేమను మాన్సీ అంగీకరించిందా ? లేక మానవ్‌ కుటుంబం చేసిన తప్పును క్షమించి అతడిని ప్రేమకు ఆమోదం తెలిపిందా? అన్న ముక్కోణపు ప్రేమ కథను సుభాష్‌ ఘాయ్‌ అందంగా వెండితెరపై ఆవిష్కరించారు.

Also Read : Hero Vijay: ఉన్న కార్లు అమ్మేసి కొత్త లగ్జరీ కారు కొన్న కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com