Stree 2: బాక్సాఫీస్‌ ని షేక్‌ చేస్తున్నశ్రద్ధా కపూర్‌ ‘స్త్రీ 2’ !

బాక్సాఫీస్‌ ని షేక్‌ చేస్తున్నశ్రద్ధా కపూర్‌ ‘స్త్రీ 2’ !

Hello Telugu - Stree 2

Stree 2: రాజ్‌ కుమార్‌ రావు, శ్రద్ధా కపూర్‌, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రల్లో అమర్‌ కౌశిక్‌ తెరకెక్కించిన కామెడీ హారర్‌ చిత్రం ‘స్త్రీ 2(Stree 2)’. 2018లో వచ్చిన ‘స్త్రీ(Stree)’ సినిమాకు సీక్వెల్‌ గా తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్టు 15న విడుదలై బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని అందుకుంది. రూ.50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే రూ.135 కోట్ల కలెక్షన్స్‌ని రాబట్టింది.  కంటెంట్‌ బాగుంటే చాలు నటీనటులు, భాషతో సంబంధం లేకుండా సినిమాలను ఆదరిస్తున్నారు నేటి ప్రేక్షకులు అనే దానికి ఈ సినిమా ఉదాహరణగా నిలుస్తోంది. సినిమాకు హిట్‌ టాక్‌ వస్తే… ఏ భాషలోనే తెరకెక్కించినా థియేటర్స్‌కి వెళ్లి చూస్తారు అనే దానికి ప్రతీకగా ఈ సినిమా నిలుస్తోంది. బాలీవుడ్‌ మూవీ స్త్రీ 2కి పాన్ ఇండియా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

వాస్తవానికి ఈ సినిమాకి ప్రిమియర్‌ షో నుంచే హిట్‌ టాక్‌ వచ్చింది. తొలి రోజు ఏకంగా రూ. 51 కోట్ల కలెక్షన్స్‌ ని రాబట్టింది. ఈ మధ్యకాలంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోల సినిమాలకు కూడా ఈ స్థాయి కలెక్షన్స్‌ రాలేదు. వరుసగా ఐదు రోజుల పాటు సెలవులు రావడం కూడా సినిమాకు ప్లస్‌ అయింది. దీనికి తోడు ఆగస్ట్‌ 15న విడుదలైన చిత్రాలన్నీ ప్లాప్‌ టాక్‌ మూటగట్టుకోవడం కూడా స్త్రీ 2కు కలిసొచ్చింది.

Stree 2 – స్త్రీ 2 కథేమిటంటే ?

2018 లో రిలీజై భారీ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచిన హారర్‌ థ్రిల్లర్‌ స్త్రీ(Stree) చిత్రానికి సీక్వెల్‌ ఇది. పార్ట్‌ 1లో స్త్రీ పీడా విరిగిపోయిందని చండేరీ ప్రజలు ప్రశాంతంగా ఉంటారు. అయితే అప్పుడే సర్‌ ఖటా అనే విచిత్రమైన దెయ్యం ఒకటి ఊర్లోని అమ్మాయిలను మాయం చేయడం ప్రారంభిస్తుంది. అలా ఓ సారి విక్కీ (రాజ్ కుమార్ రావు) స్నేహితుడి ప్రియురాలిని సర్‌ ఖటా మాయం చేస్తుంది. దీనితో నలుగురు స్నేహితులు(రాజ్‌ కుమార్‌ రావు, పంకజ్‌ త్రిపాఠి, అభిషేక్‌ బెనర్జీ, అపర్‌ శక్తి ఖురానా) కలిసి స్త్రీ (శ్రద్ధా కపూర్‌) సహాయం కోరతారు. విచిత్రమైన దెయ్యం సర్‌ ఖటా నుంచి చండేరీ ప్రజలను ‘స్త్రీ’ గ్యాంగ్‌ ఎలా రక్షించింది అనేది ఈ సినిమా స్టోరీ.

దర్శకుడు అమర్ కౌశిక్ వైవిధ్యమైన స్క్రీన్‌ప్లేతో ఎక్కడా బోర్‌ కొట్టకుండా కథనాన్ని నడిపించాడు. సినిమా ఒకవైపు భయపెడుతూనే మరోవైపు నవ్వులు పంచుతోంది. కామెడీ, హారర్‌ రెండింటిని బ్యాలన్స్‌ చేస్తూ ఆసక్తికరంగా కథనాన్ని సాగించాడు. ఇక ప్రత్యేక పాటలో తమన్నా స్టెప్పులేయడం.. అక్షయ్‌ కుమార్‌ అతిథి పాత్ర లో కనిపించడం సినిమాకు మరో స్పెషల్‌ అట్రాక్షన్‌. ఈ చిత్రం కచ్చితంగా 500 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉందని సీనీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Also Read : Rakshith Shetty: కాపీ రైట్ కేసులో ఢిల్లీ హైకోర్టులో రక్షిత్‌ శెట్టికి చుక్కెదురు !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com