Sivakarthikeyan: ఆర్. రవికుమార్ దర్శకత్వంలో శివకార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘అయలాన్’. భారీ బడ్జెట్ తో ‘పాన్ ఇండియా’ మూవీగా నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నారు. 2016లో ఈ సినిమా ప్రకటించినప్పటికీ వివిధ కారణాలతో నిర్మాణంతో పాటు విడుదలలో తీవ్ర జాప్యం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా పూర్తి చేయడం కోసం నిర్మాత ఎదుర్కొన్న ఆర్ధిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని హీరో శివకార్తికేయన్(Sivakarthikeyan) తన పారితోషకాన్ని వదులుకున్నట్లు ప్రకటించారు. దీనితో సినిమాపై శివకార్తికేయన్ కు ఉన్న ప్రేమను నెటిజన్లు అభినందిస్తున్నారు. నిర్మాతను అర్ధం చేసుకున్న కొద్ది మంది హీరోల్లో మీరొకరు అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Sivakarthikeyan Comment
‘‘అయలాన్’ ప్రారంభించాక నిర్మాత కొన్ని ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. సినిమా పూర్తి కావడమే నాకు ముఖ్యమనిపించింది. నాకు పారితోషికం ఇవ్వకపోయినా సరే సినిమాను మాత్రం పూర్తి చేయమని చెప్పాను. ఎందుకంటే తమిళ చిత్ర పరిశ్రమను ఇలాంటి సినిమాలు మరోస్థాయికి తీసుకువెళ్తాయి. ఈ సినిమాలోని కంటెంట్‌ను అందరూ ఆదరిస్తారని నాకు పూర్తి నమ్మకముంది.
మేము దీన్ని ప్రారంభించినప్పుడు అసలు ‘పాన్ ఇండియా’ అనేది లేదు. ‘బాహుబలి2’ విడుదల తర్వాత భారతీయ చలనచిత్ర పరిశ్రమలో చాలా మార్పులు వచ్చాయి. ఆ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విజయాన్ని సాధించి వసూళ్లను సొంతం చేసుకుంది. మేము ‘అయలాన్’ తో తమిళ చిత్ర పరిశ్రమ కూడా వైవిధ్యమైన కంటెంట్‌ను అందించగలదని నిరూపించాలనుకున్నాం. కానీ, చిత్రీకరణ ఆలస్యమైంది. దురదృష్టవశాత్తు ఈ సినిమా నిర్మాత సమస్యలు ఎదుర్కొన్నారు. అందుకే దీని కోసం నేను డబ్బులు తీసుకోలేదు. దీన్ని ప్రేక్షకులకు అందించడం మాత్రమే నా ముందు ఉన్న ఏకైక లక్ష్యం’’ అని ఆయన చెప్పారు.
Also Read : Kangana Ranaut: ఓటీటీలోకి కంగనా రనౌత్ ‘తేజస్’… స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?