సైమా అవార్డ్స్ 2023 కు గాను తమిళ సినీ రంగానికి చెందిన నటీ నటులకు సంబంధించి అవార్డులను ప్రకటించారు . దుబాయ్ వేదికగా కన్నుల పండువగా జరిగింది పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం. ఇప్పటికే తెలుగు, కన్నడ సినీ రంగానికి సంబంధించి అవార్డులను ప్రకటించారు.
తాజాగా తమిళ సినీ రంగానికి సంబంధించి పురస్కారాలను వెల్లడించింది సైమా . ఉత్తమ చిత్రంగా మణిరత్నం తీసిన పొన్నియన్ సెల్వన్ -1 ఎంపికైంది. ఉత్తమ దర్శకుడిగా లోకేష్ కనగరాజ్ విక్రమ్ సినిమాకు అందుకున్నారు. ఉత్తమ నటుడిగా విక్రమ్ మూవీలో నటించిన కమల్ హాసన్ కు దక్కింది. ఉత్తమ నటిగా పొన్నియన్ సెల్వన్ -1 చిత్రంలో నటించి మెప్పించిన త్రిష కృష్ణన్ ను వరించింది.
ఉత్తమ నటుడిగా రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్స్ చిత్రానికి దర్శకత్వం వహించి, నటించిన ఆర్. మాధవన్ ఎంపికయ్యారు. ఉత్తమ నటిగా కీర్తి సురేష్ , ఉత్తమ సంగీత దర్శకుడిగా విక్రమ్ సినిమాకు గాను అనిరుధ్ రవిచందర్ కు లభించింది.
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ గా పొన్నియన్ సెల్వన్ -1కి గాను రవి వర్మన్ , ఉత్తమ సహాయ నటిగా వాసంతి ఎంపికైంది. ఉత్తమ సహాయ నటుడిగా కాళీ వెంకట్ , ఉత్తమ విలన్ గా ఎస్జే సూర్య, ఉత్తమ హాస్య నటుడిగా యోగి బాబు లవ్ టుడే లో నటించినందుకు గాను అవార్డు అందుకున్నారు.
ఉత్తమ గాయకుడిగా కమల్ హాసన్ విక్రమ్ లో పాతాళ పాతాళ కోసం ఎంపికయ్యారు. ఉత్తమ గీత రచయితగా పొన్నియన్ సెల్వన్ -1లో రాసినందుకు గాను ఇళంగో కృష్ణన్ , ఉత్తమ నూతన నిర్మాతగా గౌతం రామచంద్రన్ , ఉత్తమ నూతన దర్శకుడిగా ఆర్. మాధవన్ ఎంపికయ్యారు.
ఉత్తమ నూతన నటుడిగా ప్రదీప్ రంగనాథన్ , ఉత్తమ నూతన నటిగా ఆదితి శంకర్ విరుమాన్ లో నటించినందుకు గాను అవార్డు అందుకున్నారు. ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్ గా తోట తరణి, ఉత్తమ అచీవ్మెంట్ సాధించినందుకు గాను మణిరత్నం ఎంపికయ్యారు.