Sharathulu Varthisthai: కుమారస్వామి (అక్షర) దర్శకత్వంలో చైతన్యరావు, భూమిశెట్టి జంటగా తెరకెక్కిన చిత్రం ‘షరతులు వర్తిస్తాయి!’. మార్చిలో థియేటర్లలో విడుదలై… ప్రేక్షకులకు మంచి వినోదం పంచింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫాం ‘ఆహా’లో ఈనెల 18 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ‘‘మంచి మిడిల్ క్లాస్ మూవీ చూడాలనుందా? అయితే షరతులు వర్తిస్తాయి’’ అంటూ సదరు సంస్థ సోషల్ మీడియా వేదికగా పోస్టర్ విడుదల చేసింది.
Sharathulu Varthisthai – కథేమిటంటే ?
నీటిపారుదల శాఖలో క్లర్క్ గా పనిచేస్తుంటాడు చిరంజీవి (చైతన్యరావ్ ). తండ్రి లేకపోవడంతో ఇంటి బాధ్యతల్ని భుజాన వేసుకుని… తల్లి (పద్మావతి), చెల్లి, తమ్ముడి బాగోగుల్ని చూసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంటాడు. పెద్దలను ఒప్పించి తన చిన్ననాటి స్నేహితురాలైన విజయశాంతి(Vijaysanthi) (భూమిశెట్టి)ని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లయ్యాక విజయశాంతి స్టేషనరీ దుకాణంలో పని మానేసి భర్త, కుటుంబాన్ని చక్కగా చూసుకోవాలనుకుంటుంది. అదే సమయంలో చిరంజీవి ఉంటున్న సావిత్రిబాయి బస్తీలో గోల్డెన్ ప్లేట్ పేరుతో గొలుసుకట్టు చిట్టీల వ్యాపారం మొదలవుతుంది. కమిషన్లు, బహుమతుల పేరుతో గోల్డెన్ ప్లేట్ సంస్థ స్థానికులను ఆకర్షిస్తుంటుంది. కష్టపడకుండా సులభంగా డబ్బు ఇచ్చే సంస్థలను నమ్మి మోసపోవద్దని చిరంజీవి తన కుటుంబసభ్యులు, స్నేహితులు, ఇరుగుపొరుగు వారిని హెచ్చరిస్తుంటాడు.
ఈ క్రమంలో ఫీల్డ్ వర్క్‌పై 10 రోజులు బయటకు వెళ్తాడు చిరంజీవి(Chiranjeevi). తను పొదుపు చేసిన డబ్బులతో భార్యకు స్టేషనరీ దుకాణం పెట్టిద్దామని బ్యాంకు నుంచి డబ్బులు తీసుకొచ్చి భార్యకు ఇస్తాడు. చిరంజీవి స్నేహితులు, అతని తల్లి, విజయ్‌శాంతికి మాయమాటలు చెప్పి గోల్డెన్ ప్లేట్ సంస్థలో పెట్టుబడి పెట్టిస్తారు. స్థానిక నాయకుడు శంకరన్న (సంతోష్ యాదవ్) కూడా అందులో డబ్బుపెట్టి బస్తీ వాళ్లలో నమ్మకాన్ని కుదురుస్తాడు. రాత్రికి రాత్రే ఆ సంస్థ బోర్డు తిప్పేస్తుంది. ఆ విషయం తెలిసిన చిరంజీవి తల్లి కుప్పకూలిపోతుంది. నమ్మి డబ్బులిస్తే నాశనం చేశానంటూ భార్య కుంగిపోతుంది. ఈ పరిస్థితుల్లో చిరంజీవి ఏం చేశాడు? శంకరన్నకు గోల్డెన్ ప్లేట్ సంస్థతో ఉన్న సంబంధం ఏంటి? మధ్య తరగతి కుటుంబాలను నమ్మించి మోసం చేస్తున్న గోల్డెన్ ప్లేట్ సంస్థకు చిరంజీవి ఎలా అడ్డుకట్ట వేశాడన్నది మిగతా కథ.
Also Read : Actor Tabu : టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు చేరిన యాక్టర్ ‘టబు’