Sandeep Reddy Vanga: అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ మూడు సినిమాలతో పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా మారిపోయారు సందీప్ రెడ్డి వంగా. కింగ్ నాగార్జున నటించిన కేడి సినిమాతో అసిస్టెంట్ డైరెక్టర్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా… ఆ తరువాత మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సినిమాకు కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసారు. దర్శకుడిగా ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ అవకాశాలు రాకపోవడంతో స్వయంగా ఓ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి అర్జున్ రెడ్డి అనే సినిమాను తెరకెక్కించడానికి సన్నాహాలు చేసుకున్న సమయంలో సందీప్(Sandeep Reddy Vanga) ఎదుర్కొన్న ఆర్ధిక ఇబ్బందులపై ‘యానిమల్’ నటుడు సిద్ధాంత్ కర్నిక్ ఆశక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. ముంబైలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న సిద్ధాంత్ కర్నిక్… సందీప్‌రెడ్డి వంగాకు ఫిల్మ్ మేకింగ్‌పై ఉన్న ఆసక్తి, ఎదుర్కొన్న ఆర్ధిక ఇబ్బందులపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.
Sandeep Reddy Vanga – సిద్ధాంత్ కర్నిక్ ఏమన్నారంటే…
కేడీ, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన సందీప్ వంగా(Sandeep Reddy Vanga)… స్టోరీ పట్టుకుని ఎంతోమంది వద్దకు వెళ్ళినప్పటికీ అవకాశాలు రాలేదు. దర్శకుడిగా నిరూపించుకునేందుకు ఆయనకు ఎవరూ అవకాశాలు ఇవ్వకపోవడంతో స్నేహితులతో కలిసి నిర్మాణ సంస్థను ప్రారంభించి సినిమా చేయాలనుకున్నారు. అయితే మరో నెల రోజుల్లో సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది అనగా… డబ్బులిస్తానన్నవారు చేతులెత్తేశారు. ఈ విషయం తెలుసుకున్న సందీప్ కుటుంబం వెంటనే ఊర్లో ఉన్న 36 ఎకరాల మామిడి తోటను విక్రయించి సినిమాను పూర్తి చేసారు. ‘‘యానిమల్’ షూట్ వల్ల సందీప్ రెడ్డి వంగా జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకోగలిగాను. సందీప్ సోదరుడు ప్రణయ్ నాతో చాలా విషయాలు పంచుకున్నారు. ప్రణయ్ ఈ విషయం చెప్పినప్పుడు నేను షాకయ్యా. సినిమా కోసం ఎవరూ అంతటి సాహసం చేయరు’’ అని ఆయన తెలిపారు.
మామిడితోట అమ్మిన డబ్బును పెట్టుబడిగా పెట్టి సందీప్ తొలి చిత్రం అర్జున్ రెడ్డి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో పెట్టిబడికి నాలుగింతలు లాభం వచ్చింది. వెంటనే అదే సినిమాను షాహిద్ కపూర్ హీరోగా కబీర్ సింగ్ పేరుతో హిందీలో రీమేక్ చేసిన సందీప్ రెడ్డి వంగా అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. కేవలం ఒకే ఒక్క సినిమాతో బాలీవుడ్ లోకి ప్రవేశించిన సందీప్… రణ్ బీర్ కపూర్ హీరోగా ‘యానిమల్’ ను తెరకెక్కించి మరొక బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించారు. సుమారు 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ ‘యానిమల్’ సినిమా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 700 కోట్ల రూపాయలను వసూలు చేయగా… బాక్సాఫీసు ముందు ఇంకా తన కలెక్షన్ల సునామీను కొనసాగిస్తుంది.
Also Read : Rishab Shetty: పుట్టిన ఊరు రుణం తీర్చుకుంటున్న కాంతారా హీరో రిషబ్ శెట్టి