Salman Khan: సల్మాన్ హత్యకు రూ. 25 లక్షలకు ఒప్పందం ?

సల్మాన్ హత్యకు రూ. 25 లక్షలకు ఒప్పందం ?

Hello Telugu - Salman Khan

Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి వ‌ద్ద ఇటీవ‌ల చోటుచేసుకున్న కాల్పుల ఘ‌ట‌న‌లో అయిదుగురు నిందితులపై నవీ ముంబై పోలీసులు తాజాగా దాఖ‌లు చేసిన చార్జ్‌ షీట్‌లో సంచ‌ల‌న విష‌యాలు వెలుగు చూశాయి. స‌ల్మాన్ ఖాన్‌ను హ‌త్య చేసేందుకు క‌రుడుగట్టిన బిష్ణోయ్‌ గ్యాంగ్‌ పన్నిన భారీ కుట్ర బ‌య‌ట‌ప‌డింది. ఏప్రిల్‌ 14న ముంబైలోని బాంద్రా ఏరియాలోని సల్మాన్‌ ఖాన్‌(Salman Khan) నివాసం ఉండే గెలాక్సీ అపార్టుమెంట్ దగ్గర కాల్పులు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు మూడు రౌండ్ల కాల్పులు జరిపి పారిపోయారు. ఈ కేసుపై ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరైన అనుజ్‌ థాపన్‌ అనే నిందితుడు మే 1న పోలీసు లాకప్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు.

Salman Khan….

ఈ కేసులో సమగ్ర విచారణ చేపట్టిన నవీన్ ముంబై పోలీసులు… లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ సల్మాన్ ఖాన్ హత్యకు పక్కా కుట్ర పన్నిందని తేల్చారు. మొత్తం ఐదుగురు నిందితులపై తాజాగా 350 పేజీల ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. వీరిపై హత్యకు కుట్ర, ఇతర తీవ్రమైన నేరాలకు సంబంధించిన అభియోగాలను మోపారు. రూ. 25 లక్షల ఒప్పందం ప్రకారం సల్మాన్‌ ను హత్య చేయాలనుకున్నారని, ఆగస్ట్ 2023 నుంచి ఏప్రిల్ 2024 వరకు నెలల పాటు ఈ హత్య ప్రణాళికను రూపొందించారని పోలీసులు పేర్కొన్నారు.

నిందితుల ముఠా ఏకేK-47, ఏకే-92, M16 రైఫిల్స్‌ వంటి అధునాతన మారణాయుధాలను పాకిస్థాన్ నుంచి కొనుగోలు చేయాలని భావించారని పోలీసులు పేర్కొన్నారు. అంతేకాదు 2022లో సింగర్ సిద్ధూ మూసేవాలా హత్యలో ఉపయోగించిన టర్కీలో తయారయ్యే ‘జిగానా పిస్టల్‌’ను కూడా తెప్పించేందుకు పథకం సిద్ధం చేసిన‌ట్లు దర్యాప్తులో తేలిందని వివరించారు.

సల్మాన్‌(Salman Khan) హత్య కుట్రలో భాగంగా సల్మాన్‌ పన్వెల్ ఫామ్‌హౌస్‌ పరిసర ప్రాంతాలు, బాంద్రాలోని నివాసం సహా షూటింగ్‌కు వెళ్లే గోరేగావ్ ఫిల్మ్ సిటీని బిష్ణోయ్‌ గ్యాంగ్‌ కు చెందిన సుమారు 70 మంది రెక్కీ నిర్వహిస్తూ… నటుడి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లు విచారణలో తేలింది. ఇక హత్య చేసేందుకు 18 ఏళ్ల లోపు బాలుళ్లను నియమించుకున్నారని ఛార్జ్ షీట్ పేర్కొంది.

నిందిత మైనర్‌ లు దాడి చేసేందుకు ఉత్తర అమెరికా నుంచి ప‌నిచేస్తున్న‌ట్లు భావిస్తున్న గ్యాంగులోని కీలక వ్యక్తులైన గోల్డీ బ్రార్, అన్మోల్ బిష్ణోయ్ నుంచి ఆదేశాల కోసం ఎదురు చూశారని పోలీసులు వెల్లడించారు. హత్య తర్వాత కన్యాకుమారి మీదుగా శ్రీలంకకు పారిపోయేలా ప్రణాళిక కూడా సిద్ధమైనట్లు పోలీసులు చార్జ్ షీట్ లో పేర్కొన్నారు.

Also Read : Kabzaa: ఉపేంద్ర ‘కబ్జ’ సినిమాకి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అభినందనలు !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com