Jani Master : టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు రంగారెడ్డి కోర్టులో ఊరట లభించింది. జానీ మాస్టర్‌కు కోర్టు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. కేవలం ఐదు రోజులు మాత్రమే బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నేషనల్ అవార్డు తీసుకోవడం కోసం జానీ మాస్టర్‌కు రంగారెడ్డి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం చంచల్ గూడా జైలులో జానీ ఉన్నారు. బెయిల్ మంజూరు అయిన నేపథ్యంలో ఈరోజు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.
Jani Master Case Updates…
అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కుంటున్న జానీ మాస్టర్‌ను గత నెలలో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. గోవాలో జానీ మాస్టర్(Jani Master)ను రాజేంద్రనగర్ ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోవా స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి పీటీ వారెంట్ తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు. రాజేంద్రనగర్ సర్కిల్ ఉప్పర్‌పల్లిలోని 13వ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరుపరిచారు. పోలీసులు సమర్పించిన ఆధారాలను పరిశీలించి, ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి.. అక్టోబరు 3వ తేదీ వరకు (14 రోజుల) రిమాండ్ విధించారు.
దీంతో ప్రస్తుతం చంచల్‌గూడ్ జైలులో ఉన్నారు. అలాగే జానీ మాస్టర్(Jani Master)ను కస్టడీకి కోరుతూ పిటిషన్ దాఖలవగా.. నాలుగు రోజుల పాటు కస్టడీ విధిస్తూ రంగారెడ్డి కోర్టు తీర్పునిచ్చింది. దీంతో జానీమాస్టర్‌ను నాలుగు రోజుల పాటు నార్సింగ్ పోలీసులు విచారించారు. పోలీసుల కస్టడీలో బాధితురాలే తనను వేధింపులకు గురి చేసిందంటూ జానీ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే ఈ అంశానికి సంబంధించి జానీ మాస్టర్ భార్య సుమలత ఫిల్మ్ ఛాంబర్‌కు ఫిర్యాదు చేసింది. ఐదు సంవత్సరాలుగా నరకం అంటే ఏంటో తనకు చూపించిందని.. ఆత్మహత్యాయత్నం చేసుకునే వరకు తీసుకెళ్లిందని పేర్కొంది. తన భర్త జానీపై లేని పోనీ ఆరోపణలు చేసిన మహిళా కొరియోగ్రాఫర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు నేపథ్యంలో సుమలత నుంచి ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వివరణ కోరింది. దీంతో వివరణ ఇచ్చేందుకు బుధవారం ఫిల్మ్ ఛాంబర్ కమిటీ ముందు ఆమె హాజరయ్యారు. మహిళా కొరియోగ్రాఫర్‌కు సంబంధించిన అన్ని ఆధారాలను ఫిల్మ్ ఛాంబర్ కమిటీకి జానీ మాస్టర్ భార్య అందించారు. సుమలత దగ్గర నుంచి ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీ సభ్యులు వివరాలు సేకరించారు.
Also Read : Film Celebraties : మంత్రి కొండా సురేఖ సమంత పై వ్యాఖ్యలకు భగ్గుమన్న హీరోలు