Pushpa 2 : ‘పుష్ప 2’ మూవీ నైట్ ప్రీమియర్స్ సందర్భంగా బుధవారం రాత్రి హైదరాబాద్ RTC క్రాస్ రోడ్స్‌లో సంధ్య థియేటర్‌కు చిత్ర హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) రావడంతో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందగా.. ఆ మహిళ కుమారుడి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ తొక్కిసలాటకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లుగా సమాచారం. ఈ క్రమంలో పలువురు అల్లు అర్జున్ ఫ్యాన్ సంఘాలను విచారించనున్నారని తెలుస్తోంది.
Pushpa 2 Benfit Show-Lady Death
అసలు విషయం ఏమిటంటే.. హీరో అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2(Pushpa 2)’ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో దిల్సుఖ్ నగర్‌కు చెందిన రేవతి అనే మహిళ (39) మృతి చెందింది. ఆమె కుమారుడు తొమ్మిదేళ్ల శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. రాత్రి 9.30 గంటల ప్రీమియర్ షో చూసేందుకు రేవతి, ఆమె భర్త భాస్కర్, ఇద్దరు పిల్లలు శ్రీతేజ్, సన్వీక (7) దిల్సుఖ్ నగర్ నుంచి సంధ్య థియేటర్‌కు వచ్చారు. అదే సమయంలో.. హీరో అల్లు అర్జున్ సంధ్య థియటర్ వద్దకు వచ్చారు. అప్పటికే అక్కడ పెద్ద సంఖ్యలో ఉన్న అభిమానులు ఆయన్ను చూసేందుకు ఎగబడ్డారు.
అల్లుఅర్జున్ థియేటర్లోకి వెళ్లాక.. అభిమానులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అప్పుడు జరిగిన తోపులాటలో రేవతి, ఆమె కుమారుడు, మరో వ్యక్తి కిందపడి స్పృహ కోల్పోయారు. పోలీసులు వారికి ప్రథమ చికిత్స చేసి.. ఆంధ్ర మహిళా సభ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకొచ్చేసరికే రేవతి మరణించినట్టు వైద్యులు తెలిపారు. ఆమె మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. ఆమె కుమారుణ్ని మరింత మెరుగైన చికిత్స నిమిత్తం వేరే ఆస్పత్రికి తరలించారు. కాగా.. స్పృహతప్పిన బాలుడు శ్రీతేజ్‌కు పోలీసులు సీపీఆర్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనతో ఆర్టీసీ క్రాస్ రోడ్ పరిసరాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ ఘటనపై ప్రస్తుతం కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు.
Also Read : Chay-Sobhita Marriage : చైతన్య శోభితల వివాహంపై కింగ్ నాగార్జున ట్వీట్