Producer Sivaramakrishna : హైదరాబాద్ రాయదుర్గంలో రూ.10వేల కోట్లకు పైగా విలువైన 84 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా కేసులో అరెస్టైన తెలుగు సినీ నిర్మాత శివరామకృష్ణ మరోసారి వార్తల్లోకి వచ్చారు. 4 రోజుల క్రితం శివరామకృష్ణను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపగా అనారోగ్య కారణాలతో బెయిల్ పొందారు. దీంతో శివరామకృష్ణ బెయిల్ రద్దు చేయాలని కోర్టులో పోలీసులు పిటిషన్ వేయగా తాజాగా ఆ బెయిల్‌ను రద్దు చేశారు. దీంతో శివరామకృష్ణ(Producer Sivaramakrishna) మళ్లీ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఈ నిర్మాత గతంలో వెంకటేశ్‌తో సాహాసవీరుడు సాగరకన్య, ప్రేమంటే ఇదేరా, పవన్ కల్యాణ్‌తో తమ్ముడు, మహేశ్ బాబుతో యువరాజు, రవితేజతో దరువు, ఉదయ్ కిరణ్‌తో శ్రీరామ్ వంటి సినిమాలను నిర్మించి గుర్తింపు తెచ్చుకున్నారు.
Producer Sivaramakrishna Arrested
అసలు విషయానికి వస్తే.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ రాష్ట్ర ఆర్కైవ్స్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చెందిన రాయదుర్గం పరిధిలోని సర్వే నంబర్ 46లో 83 ఎకరాల భూమిని సినీ నిర్మాత శివరామకృష్ణ కబ్జా చేశారని ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ జరీనా పర్వీన్ ఈ ఏడాది ఆగస్టులో సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. భూ కబ్జా కేసు కావడంతో దానిని ఓయూ పీఎస్‌కు బదిలీ చేశారు. దర్యాప్తు ప్రారంభించిన ఓయూ పోలీసులు నిందితులను ఈ నెల 17న వారిని అరెస్టు చేశారు. కాగా, ఆర్కియాలజీ డిపార్టుమెంట్లో బహమనీ, దక్కన్ రాజవంశాలతో పాటు.. కుతుబ్‌షాహీ, ఆదిలా షాహీ, షాజహాన్ చక్రవర్తి కాలం నుంచి మెఘలులు, అసఫ్ జాహీల వరకు దాదాపు 43 మిలియన్ల విలువైన రికార్డులను కలిగి ఉంది. రికార్డులను డిజిటలైజేషన్ చేస్తున్న క్రమంలో రాయదుర్గంలోని 83 ఎకరాలు, ఇబ్రహీంపట్నం పరిఽధిలోని యాచారంలో 10 ఎకరాల భూమికి సంబంధించిన పహాణీ, సేత్వార్లు కనిపించకుండా పోయాయి. ఈ భూములను సినీ నిర్మాత శివరామృష్ణ కబ్జా చేసినట్లు గుర్తించారు.
డిపార్టుమెంట్లో 1993 నుంచి రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కె. చంద్రశేఖర్‌ను శివరామకృష్ణ(Producer Sivaramakrishna) మచ్చిక చేసుకొని.. అతని సహకారంతో రికార్డుల్లోని పత్రాలను మాయం చేసినట్లు 2003లో గుర్తించారు. దాంతో అప్పటి ప్రభుత్వం చంద్రశేఖర్‌ను సస్పెండ్ చేయడంతో పాటు.. ఉన్నత న్యాయస్థానంలో కేసు వేసింది. అయితే చంద్రశేఖర్ ద్వారా పత్రాలు కొట్టేసిన శివరామకృష్ణ(Producer Sivaramakrishna) ప్రముఖ బిల్డర్ అయిన మారగోని లింగం గౌడ్ సహకారంతో వాటిని తన పేరున మార్చుకొని నకిలీ పత్రాలు సృష్టించి ఆ 83 ఎకరాల భూమి తనదేనని పత్రాలను కోర్టుకు సమర్పించాడు.
కొన్నేళ్లుగా న్యాయస్థానంలో ప్రభుత్వం న్యాయపోరాటం చేస్తున్న క్రమంలో కేసు సుప్రీంకోర్టుకు చేరింది. 22 ఏళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం అనంతరం దేశ అత్యున్నత న్యాయస్థానం శివరామకృష్ణను దోషిగా తేల్చింది. ఈ నేపథ్యంలో నిందితుడు శివరామకృష్ణను ఓయూ పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ప్రస్తుతం అక్కడ భూమి ధర ఎకరం రూ.100 కోట్లు ఉంటుందని అంచనా. ఈ లెక్కన రూ.10వేల కోట్ల విలువైన భూమిని కబ్జా చేసినట్లు అధికారులు తేల్చారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది. ఈ కబ్జా పథకంలో ఎంతమంది ఉన్నారు? ఎవరెవరి పాత్ర ఏంటి? అని తేల్చే పనిలో ఓయూ పోలీసులు నిమగ్నమయ్యారు. యాచారంలో కబ్జాకు గురైన 10 ఎకరాలపై కూడా దర్యాప్తు ముమ్మరం చేసినట్లు తెలిసింది.
Also Read : Karan Johar : సెలబ్రిటీ రివ్యూలపై, మూవీ కలెక్షన్స్ కరణ్ జోహార్ సంచలన వ్యాఖ్యలు