Priyamani: షారుక్ ఖాన్ తో కలిసి పని చేసే అవకాశం రావాలేగానీ ఎంత మంచి ప్రాజెక్టులైనా వదిలేయడానికి సిద్ధమంటోంది సీనియర్ నటి ప్రియమణి. గతంలో ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’లో… ‘1 2 3 4 గెట్ ఆన్ ది డాన్స్‌ఫ్లోర్’ పాటలో షారుక్ తో ఆడిపాడిన ప్రియమణి… ఇటీవల ‘జవాన్’ చిత్రంలో ఓ ముఖ్య పాత్రలో నటించింది. ఇటీవలే అజయ్ దేవగన్ తో కలిసి ‘మైదాన్’తో అలరించిన ప్రియమణి… ఓ ఈవెంట్ లో మాట్లాడుతూ… షారుక్‌తో మళ్లీ కలిసి నటించాలనుందని మనసులో మాట బయట పెట్టింది.
Priyamani Comment
‘ఒకవేళ షారుక్ నన్ను పిలిచి ‘రేపే వచ్చేయ్… నాతో కలిసి పని చేయాలి’ అని చెబితే వెంటనే వెళ్లిపోతా. నా చేతిలో ఉన్న ప్రాజెక్టులన్నీ వదిలేస్తా. ఆయనతో కలిసి పని చేయడమే నాకు అన్నింటికన్నా ముఖ్యం’ అంటూ ఉత్సాహంగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ప్రియమణి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. కింగ్ ఖాన్ షారూక్ సరసన నటించడానికి కొత్త హీరోయిన్ అయితే ఆనంద పడాలి కాని… ఇప్పటికే రెండు సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించిన సీనియర్ నటికి కూడా షారూక్ సరసన నటించడం అంటే అంత ఇష్టమా అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
కేరళకు చెందిన ప్రియ వాసుదేవ మణి అయ్యర్…. సింపుల్ గా ప్రియమణిగా దక్షిణాదిలో స్థిరపడింది. ఎవరే అతగాడు సినిమాతో టాలీవుడ్ లో 2003లో ఎంట్రీ ఇచ్చిన ప్రియమణి(Priyamani)… పెళ్ళైన కొత్తలో, యమదొంగ సినిమాలతో తెలుగులో పాపులారిటీను సంపాదించుకుంది. ఆ తరువాత గోలీమార్, రగడ, రక్త చరిత్ర, చారులత సినిమాలతో ఫరవాలేదనిపించిన ఈ మలయాళ కుట్టి… బుల్లితెరపై ప్రసారమయ్యే రియాలిటీ షోలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాలతో పాటు షారూక్ తో చెన్నై ఎక్స్ ప్రెస్ లో ఐటెం సాంగ్ లో నర్తించిన ప్రియమణి… తాజాగా పవర్ ఫుల్ రోల్ తో జవాన్ లోనూ అలరించింది. ప్రస్తుతం ఆమె కీలక పాత్రలో తెరకెక్కుతున్న ‘ది ఫ్యామిలీమ్యాన్ 3’ వెబ్‌సిరీస్ చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానుంది.
Also Read : Vetrimaaran: సూర్య సినిమాపై వెట్రిమారన్ కీలక వ్యాఖ్యలు !