ఆంధ్రప్రదేశ్ – ఏపీలో కొలువు తీరిన వైసీపీ ప్రభుత్వం సినిమా రంగానికి ఇతోధికంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా సినీ రంగానికి చెందిన పోసాని కృష్ణ మురళి, ఆలీకి రాష్ట్ర స్థాయి పదవులను కట్టబెట్టారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.
ఏపీఎఫ్‌డీసీ చైర్మన్ గా కొలువు తీరిన పోసాని గత కొన్ని నెలలుగా విస్తృతంగా కసరత్తు చేశారు. నంది అవార్డుల ఎంపికపై ఫోకస్ పెట్టారు. గత ఏడాది 2022 సంవత్సరానికి సంబంధించి 22వ నంది నాటకోత్సవాలను పురస్కరించుకుని అవార్డులను ప్రకటించారు.
మొత్తం 33 నాటకాలను ఎంపిక చేసినట్లు స్పష్టం చేశారు. నంది పురస్కారాలకు సంబంధించి 5 విభాగాలలో ఎంట్రీలు తీసుకున్నామని, మొత్తం 115 ఎంట్రీలు వచ్చినట్లు పోసాని కృష్ణ మురళి తెలిపారు. ఇందులో భాగంగా మొత్తం 38 నాటకాలు ఎంపికైనట్లు ప్రకటించారు.
అవార్డులతో పాటు సాంకేతిక విభాగంలో పని చేసిన సిబ్బందికి కూడా అవార్డులు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. 73 అవార్డులు ఇస్తామన్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ పురస్కారాలు అందజేస్తామన్నారు. నగదు ప్రోత్సాహకాలను ప్రకటించారు. వచ్చే నవంబర్ నెలలో ప్రభుత్వ పరంగా అవార్డులను అందజేస్తామని చెప్పారు పోసాని కృష్ణ మురళి.