Padma Awards: వెండితెరపై వికసించిన పద్మాలు !

వెండితెరపై వికసించిన పద్మాలు !

Hello Telugu - Padma Awards-2024

వెండితెరపై వికసించిన పద్మాలు !

75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించిన పద్మ అవార్డుల్లో సినీ రంగానికి చెందిన పలువురు ఎంపిక అయ్యారు. వీరిలో మెగాస్టార్ చిరంజీవి, వైజయంతీమాల బాలి పద్మ విభూషణ్‌ పురస్కారానికి ఎంపికవగా… మరణానంతరం కెప్టెన్‌ విజయ్‌కాంత్‌కు పద్మ భూషణ్‌ అవార్డు ప్రకటించారు. ప్రముఖ బెంగాలీ నటుడు మిథున్ చక్రవర్తి, ప్రముఖ పాప్ సింగర్ ఉషా ఉతప్‌ అయ్యర్‌, ప్రముఖ సంగీత దర్శక ద్వయం లక్ష్మీకాంత్‌ ప్యారేలాల్‌ ద్వయంలో ఒకరైన ప్యారేలాల్‌ శర్మలకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్‌ ప్రకటించింది. గురువారం రాత్రి భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఈ ఏడాది అవార్డులను ప్రకటించారు. త్వరలో నిర్వహించబోయే పద్మ పురస్కారాల ప్రధానోత్సవంతో భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా వీరు తమ అవార్డులను అందుకోనున్నారు.

 

పద్మ విభూషణ్ గా చిరంజీవి

భారతీయ చలన చిత్ర పరిశ్రమలో పరిచయం అక్కర్లేని అతి తక్కువ మంది అగ్రహీరోల్లో చిరంజీవి ఒకరు. కొణిదెల శివశంకర వరప్రసాద్ గా ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి… ఇంతింతై… వటుడింతై చిరంజీవిగా సినీ ప్రపంచంతో సుస్థిత స్థానం సంపాదించుకున్నారు. నాలుగున్నర దశాబ్దాల తన ప్రస్థానంలో… 155 సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించి క్లాస్‌, మాస్‌ తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. డ్యాన్స్, ఫైట్స్, సెంటిమెంట్, కామెడీ, స్టైల్ అనే తేడాలేకుండా నవసరాలు పండించగల అతి తక్కువ మంది కళాకారుల్లో చిరంజీవి ఒకరు. ఒకవైపు సినీ ప్రపంచంలో దశాబ్ధాల పాటు నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతూనే… మరోవైపు రక్తదానం, నేత్రదానం వంటి సామాజిక సేవలతో అభిమానులతో పాటు సాధారణ ప్రజల్లో కూడా చిరంజీవిగా నిలిచాడు. దీనితో చిరంజీవి సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2006లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. కరోనా, లాక్‌డౌన్‌ సమయంలో సినీ కార్మికులతోపాటు సామాన్యులకు ఆయన అందించిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం తాజాగా చిరంజీవిని పద్మ విభూషణ్‌ పురస్కారంతో సత్కరించనుంది.

‘కలైమామణి’ వైజయంతీమాల బాలికి పద్మ విభూషణ్

అలనాటి బాలీవుడ్‌ నటి వైజయంతీమాల బాలికు కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారం ప్రకటించింది. ఒకప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలోని ట్రిప్లికెన్‌లో 1933లో జన్మించిన వైజంతీమాల… 1949లో ‘వళకై’తో సినీరంగ పరవేశం చేశారు. అదే సినిమా తెలుగులో ‘జీవితం’ పేరుతో మరుసటి ఏడాది విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. ఆతరువాత పలు హిందీ, బెంగాలీ సినిమాల్లోనూ నటించి తన అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పించడంతో పాటు రాజకీయ రంగ ప్రవేశం చేసి లోక్‌ సభ ఎంపీగా కూడా పనిచేశారు. గతంలో పద్మశ్రీ,, ‘ఏఎన్నార్‌ జాతీయ అవార్డు’, సంగీత్‌ నాటక్‌ అకాడమీ అవార్డు, తమిళనాడు అత్యున్నత పౌరపురస్కారం ‘కలైమామణి’ని అందుకున్న వైజయంతీమాల… తాజాగా పద్మ విభూషణ్ కు ఎంపికయ్యారు.

 

మిథున్‌ చక్రవర్తికి పద్మభూషణ్‌

తనదైన నటనతో ప్రేక్షకులకు ఉర్రూతలూగించిన పశ్చిమ బెంగాల్‌ కు చెందిన మిథున్ చక్రవర్తికి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్‌ అవార్డును ప్రకటించింది. 1976లో ‘మ్రిగయా’ (బెంగాలీ)తో తెరంగేట్రం చేసి, తొలి ప్రయత్నంలోనే జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. 1993లో ‘తాహదేర్‌ కథ’కు ఉత్తమ నటుడిగా, 1996లో ‘స్వామి వివేకానంద’కు ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ పురస్కారాలు అందుకున్నారు.

మరణానంతరం కెప్టెన్ విజయ్‌కాంత్‌ కు పద్మభూషణ్

 

దివంగత సినీ నటులు, దేశీయ ముర్పొక్కు ద్రావిడ కళగం (డి.ఎం.డి.కె) అధినేత కెప్టెన్ విజయకాంత్‌ కు మరణానంతరం పద్మభూషణ్ అవార్డును పరకటించారు. 27 ఏళ్ల వయసులో ఇనిక్కుం ఇలామై సినిమాతో కోలీవుడ్ లో అడుగుపెట్టిన విజయకాంత్… 20కు పైగా సినిమాల్లో పోలీసు అధికారి పాత్రలో ప్రేక్షకులను మెప్పించారు. తమిళంలో కెప్టెన్ ప్రభాకరన్ గా విడుదలైన చిత్రం… తెలుగు, హిందీ భాషల్లో డబ్బింగ్ చిత్రంగా మంచి విజయం సాధించడంతో అతనికి కెప్టెన్ విజయకాంత్ గా గుర్తింపు పొందారు. 2005లో డీఎండీకే పార్టీని స్థాపించారు. 2006, 2011 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. గతేడాది డిసెంబరు 28న అనారోగ్యంతో కన్నుమూశారు.

 

ప్రముఖ పాప్ సింగర్ ఉషా ఉతప్‌ కు పద్మభూషణ్

 

ప్రముఖ గాయని ఉషా ఉతప్‌ అయ్యర్‌కు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది. పాప్‌ సింగర్ గా ఉషా ఉతప్, సినీ ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. ఈమె గాత్రానికి ఎవరైనా ఫిదా కావల్సిందే. 1947 నవంబర్‌ 8న ముంబయిలో తమిళ అయ్యర్‌ కుటుంబంలో జన్మించిన ఉషా… చిన్నప్పటి నుంచే సంగీత ప్రపంచంలో పెరిగింది. అయితే ప్రారంభంలో తన గొంతు కారణంగా ఆమె ప్రతిభను ఎవరూ గుర్తించకపోయినప్పటికీ… మ్యూజిక్‌ క్లాస్‌లో టీచర్‌ తన గొంతు విభిన్నంగా ఉందని గుర్తించి ప్రోత్సహించడంతో గాయనిగా ఆమె ప్రయాణం మొదలైంది. అనంతరం తన పొరుగింటిలో నివసించే పోలీసు అధికారి కూతురు ఉషాలోని నైపుణ్యాన్ని గుర్తించి హిందీ పాటలు, ఇండియన్‌ క్లాసికల్‌ మ్యూజిక్‌ నేర్చుకునేలా సహకరించింది. దీనితో ఒక్కోమెట్టు ఎక్కుకుంటూ ఇండియన్‌ పాప్‌ గాయనిగా ఎన్నో భాషల్లో పాటలు పాడి ఎంతో పేరు సంపాదించారు.

ప్రముఖ సంగీత దర్శకుడు ప్యారేలాల్ కు పద్మభూషణ్

 

ప్రముఖ సంగీత దర్శక ద్వయం లక్ష్మీకాంత్‌ ప్యారేలాల్‌ ద్వయంలో ఒకరైన ప్యారేలాల్‌ శర్మలకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్‌ ప్రకటించింది. మహారాష్ట్రకు చెందిన 83 ఏళ్ల ప్యారేలాల్‌ రాంప్రసాద్‌ శర్మ ప్రముఖ హిందీ సంగీత దర్శకుడు. కింగ్‌ ఆఫ్‌ మెలోడీస్‌గా పేరున్న ప్యారేలాల్‌ తన కెరీర్‌లో ఎన్నో మరుపురాని పాటలకు సంగీతం అందించారు. 1940 సెప్టెంబర్‌ 3న మంబయిలో జన్మించిన ఈయనను అందరూ ముద్దుగా బాబాజీ అని పిలుచుకుంటారు. ఎనిమిదేళ్లకే వయోలిన్ నేర్చుకున్న ప్యారేలాల్‌… రోజు 8-12 గంటల పాటు సాధన చేసేవారు. తన 12 ఏళ్ల ప్రాయంలో కుటుంబంలో ఏర్పడిన ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇంటి కోసం పలు స్టూడియోల్లో వయోలిన్‌ ప్రదర్శనలు ఇచ్చేవారు. లక్ష్మీకాంత్‌ శాంతారామ్‌తో కలిసి పలు చిత్రాలకు సంగీతం అందించారు. 1963-1998 మధ్య 750 హిందీ చిత్రాలకు మ్యూజిక్‌ కంపోజ్‌ చేశారు. ప్రముఖ దర్శకులు, కథానాయకులు రాజ్‌ కపూర్‌, దేవ్‌ ఆనంద్‌, శక్తి సమంత, మన్మోహన్‌ దేశాయ్‌, యశ్‌ చోప్రా, కే.బాలచందర్‌, బోనీ కపూర్‌, ఓం ప్రకాశ్‌, రాజ్‌ ఖోస్లా, ఎల్వీ ప్రసాద్‌, మహేశ్‌ భట్‌, కె.విశ్వనాథ్‌, మనోజ్‌ కుమార్‌ చిత్రాలకు సంగీతాన్ని అందించారు.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com