NBK : ‘జై బాలయ్య’ అనే స్లోగన్ నేడు ప్రపంచవ్యాప్తంగా పాపులర్.. కేవలం ఆ పేరు పేరు వింటే చాలు నందమూరి అభిమానుల రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఎన్టీఆర్ వారసుడిగా, తండ్రికి తగ్గ తనయుడుగా వెండితెరపై బాలయ్య(NBK) తన నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోశారు. మాస్ హీరోగా ఎంత పాపులర్ అయ్యారో.. అంతే వైవిధ్యమైన జోనర్ సినిమాలను చేస్తూ వచ్చారు. బాలయ్య సినీరంగ ప్రవేశం చేసి నేటికి (ఆగస్ట్ 30కి) 50 వసంతాలు.. ఎన్టీఆర్ నట వారసుడిగా కెరీర్ ప్రారంభించిన బాలయ్య.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక తిరుగులేని మాస్ హీరోగా ఎదిగారు.
ప్రపంచ వ్యాప్తంగా ఎందరో నటీనటులు తమ వారసుల్ని వెండితెరకు పరిచయం చేశారు. ఆ సంప్రదాయాన్ని మన దేశంలో మహా నటుడు పృథ్విరాజ్ కపూర్ అనుసరించారు. ఆయన తనయులు రాజ్ కపూర్, షమ్మీ కపూర్, శశి కపూర్ తండ్రి లాగానే నటనను వృత్తిగా స్వీకరించి తమదైన బాణీ పలికించారు. రాజ్ కపూర్ కూడా తండ్రిని ఆదర్శంగా తీసుకొని తన ముగ్గురు కొడుకుల్ని హీరోలుగా పరిచయం చేశారు. దక్షిణాది మహా నటుడు నందమూరి తారకరామారావు ఈ విషయంలో రాజ్ కపూర్‌ను అనుసరిస్తూ తొలిసారిగా తెలుగు నాట తన తనయులు హరికృష్ణ, బాలకృష్ణను నటనా రంగంలో అడుగు పెట్టేలా ప్రోత్సహించారు. అయితే నట వారసుల్లో ఎవరికీ లేనంత సుదీర్ఘమైన కెరీర్ మాత్రం బాలకృష్ణ సొంతమైంది.
NBK 50th Anniversary
14 ఏళ్ల వయసులో తొలిసారిగా తండ్రి నందమూరి తారక రామారావు దర్శకత్వం వహించిన ‘తాతమ్మకల’ చిత్రంతో బాలనటుడిగా కెమెరా ముందుకొచ్చారు నటసింహం బాలకృష్ణ(NBK). 1974 ఆగస్టు 30న ఈ చిత్రం విడుదలైంది. తొలి చిత్రంతోనే నందమూరి నట వారసత్వాన్ని నిలబెడతాడనే నమ్మకాన్ని ఇటు ఇండస్ట్రీలోనూ, అటు అభిమానుల్లోనూ కలిగించారు. నటన బాలయ్య బాబు రక్తంలోనే ఉంది అని అందరూ ప్రశంసించారు. ‘ తాతమ్మ కల’కు కూడా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. కుటుంబ నియంత్రణ విధానాన్ని దేశంలో తొలిసారిగా ప్రవేశ పెట్టినప్పుడు ఆ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఎన్టీఆర్ నిర్మించిన సినిమా ఇది. యాభై రోజుల ప్రదర్శన పూర్తి చేసుకున్న తర్వాత సినిమాను ఆపేసి, చిన్న చిన్న మార్పులతో మళ్లీ విడుదల చేశారు. రెండు సార్లు సెన్సార్ అయి, రెండు సార్లు విడుదలైన సినిమా తెలుగులో ఇదొక్కటే. ఇందులో బాలకృష్ణది కథలో కీలకమైన పాత్ర.
Also Read : Court Movie : హీరో నాని సమర్పణలో ప్రియదర్శి హీరోగా మరో కొత్త సినిమా