Mollywood : మాలీవుడ్‌లో చెలరేగిన కాస్టింగ్ కౌచ్ చిచ్చు.. ఇప్పుడు పాన్ ఇండియా రొచ్చులా మారింది. ఒక్కరొక్కరుగా తమకెదురైన చేదు అనుభవాల్ని షేర్ చేసుకుంటూ.. మీడియా ఎదుట వాపోవడంతో ఇది దేశవ్యాప్త చర్చకు దారితీసింది. బాలీవుడ్‌ను, కోలీవుడ్‌ను, చివరకు బెంగాల్ సినీ పరిశ్రమను కూడా ఊపేస్తోంది మీటూ లొల్లి. పైకి మెరుగ్గా కనిపించే గ్లామర్ ఇండస్ట్రీలో ఇంత డ్రైనేజీ దాగుందా అని.. పరిశ్రమలోని వారు, ప్రేక్షకలోకం ముక్కున వేలేసుకుంటున్నారు. కేరళ(Kerala)లో ఐతే సినిమా ఇండస్ట్రీ మొత్తం కొలాప్స్ అయ్యేంత ప్రమాదంలో పడింది. ఈ నైతిక సంక్షోభం నుంచి ఇప్పట్లో కోలుకునేలా లేదు మాలీవుడ్.
Mollywood Cinema Industry
కేవలం పదేపదిరోజుల గ్యాప్‌లో కేరళ(Kerala) సినిమా పరిశ్రమ కుదేలైపోయింది. పేకమేడలా కుప్పకూలింది. దేశమంతా తమని దోషులుగా చూడ్డంతో.. పరిశ్రమలో ప్రతీ ఒక్కరికీ తలవొంపులు తప్పలేదు. క్వాలిటీ సినిమాకు కేరాఫ్ అడ్రస్‌గా, అవార్డులు పండించే గొప్పగొప్ప సినిమాలకు అడ్డాగా పేరున్న మాలీవుడ్.. ఇంతటి నైతిక సంక్షోభాన్ని ఎప్పుడూ చవిచూడలేదు. మినూ మునీర్, పార్వతీ తిరువొత్తు.. ఇలా మలయాళ మహిళా నటులు వరసబెట్టి.. పరిశ్రమలో మగాళ్లతో తాము ఎదుర్కొన్న వేధింపుల్ని ఏకరువు పెడుతున్నారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఉంటూనే తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడంటూ సీనియర్ నటుడు సిద్ధిఖీపై ఆరోపణలు చేసిన రేవతి సంపత్.. మరో ఆరోపణ చేసి మళ్లీ సెన్సేషన్ అయ్యారు నటుడు రియాజ్ ఖాన్‌పై కూడా షాకింగ్ కామెంట్స్ చేశారామె. అర్థరాత్రి ఫోన్ చేసి.. నాతో పడుకుంటావా అని అడిగాడు.. చెప్పుతో కొడదామనిపించిది.. అంటూ ‘తులసి’ నటుడు రియాజ్ క్యారెక్టర్‌ని ప్రశ్నించింది రేవతి సంపత్.
ప్రముఖ దర్శకుడు, కేరళ(Kerala) స్టేట్ చలచిత్ర అకాడమీ అధ్యక్షుడు రంజిత్ బాలకృష్ణన్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించారంటూ ఆమె అభియోగం మోపారు. పదిహేనేళ్ల కిందట జరిగిన ఒక ఘటనను ఈ సందర్భంగా ప్రస్తావించారు శ్రీలేఖ మిత్ర. తన అపార్ట్‌మెంట్‌కి పిలిచి.. నా గాజుల గురించి చెబుతూ నన్ను తాకే ప్రయత్నం చేశారు.. అతడి ఉద్దేశాన్ని గ్రహించి వారించి బైటికొచ్చేశాను.. అంటూ నాటి పీడకలను గుర్తు చేసుకున్నారు. మలయాళ తొలి ట్రాన్స్‌జెండర్ నటి అంజలి అమీర్ సైతం.. మీటూ చేదు అనుభవాల్ని చవిచూశానంటూ మీడియా ముందుకొచ్చింది. నేషనల్ అవార్డ్ విన్నర్ సూరజ్ వెంజరమూడ్ తన ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా తన జెండర్‌ని ప్రశ్నిస్తూ మాట్లాడాడని, కలత చెంది అప్పట్లో మమ్ముట్టికి కంప్లయింట్ చేసినా ఫలితం లేకపోయిందని వాపోయారామె. సెక్సువల్ ఫేవర్స్ ఇస్తేనే.. సినిమా ఛాన్స్ ఇస్తా అంటూ నన్నొక ప్రొడ్యూసర్ బలవంతం చేశాడు.. ఐనా నేను లొంగలేదు. ఎవరికీ చెప్పుకోలేక కుమిలిపోయాను.. అంటూ జూనియర్ ఆర్టిస్ట్ అమృత సోషల్ మీడియా వేదికగా బావురుమంది. ప్రస్తుతం సిట్ అధికారులు ఆమె వాంగ్మూలాన్ని తీసుకుంటున్నారు.
మలయాళ తెరవెనుక బాగోతాలు ఇలా ఉంటే.. అక్కడెక్కడో బెంగాల్ సినీ పరిశ్రమలో కూడా ప్రకంపనలు రేపింది కేరళ(Kerala) హేమ కమిటీ రిపోర్ట్. లైంగిక వేధింపులే కాదు.. ఇక్కడ ఏకంగా వ్యభిచారమే జరుగుతోంది.. నాతోపాటు మరికొందరు మహిళలు.. దర్శక నిర్మాతల చేతుల్లో నరకం చూశాం.. అంటూ ఫేస్‌బుక్ ద్వారా ఆక్రోశం వెళ్లగక్కారు బెంగాల్ నటి రితాభరీ చక్రవర్తి. తెరవెనుక జరుగుతున్న ఈ లైంగిక దందాపై దయచేసి దర్యాప్తు చేపట్టండి మేడమ్.. అంటూ సీఎం మమతా బెనర్జీని వేడుకుంది బెంగాల్ నటి రితాభరీ చక్రవర్తి. సౌతిండియన్ సీనియర్ యాక్ట్రెస్ ఖుష్‌బూ కూడా క్యాస్టింగ్‌కౌచ్ అంశంపై స్పందించారు. ఒక్క కేరళ(Kerala)లోనే కాదు.. ప్రతీ భాషలోనూ ఫిమేల్ ఆర్టిస్టులకు సినిమా కష్టాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో స్పందించారామె. ధైర్యంతో ముందుకొచ్చి చెప్పుకున్నవాళ్లు ఒకరూ ఇద్దరే.. కానీ.. లోపల్లోపల కుమిలిపోయేవాళ్లు కోకొల్లలు.. ఎనిమిదేళ్ల వయసులోనే లైంగిక వేధింపులకు గురయ్యా.. ఇప్పుడు నా కూతుర్లను కూడా భద్రంగా కాపాడుకోవాల్సి వస్తోంది.. అనేది ఖుష్‌బూ ఇచ్చిన స్టేట్‌మెంట్.
కేరళ(Kerala)లో మొదలైన క్యాస్టింగ్ కౌచ్ రగడ.. బాలీవుడ్‌ని కూడా తాకేసింది. హిందీ చిత్ర పరిశ్రమ ఒక నిస్సహాయ ప్రదేశం.. అక్కడ ఆడవాళ్లకు కనీస రక్షణ లేదు.. అంటూ నటి, ఎంపీ కంగనా రనౌత్ ఓపెనప్ అయ్యారు. ఎవరైనా నటిగా ఎదుగుతున్నారు అనిపిస్తే చాలు.. స్పెషల్‌గా పీఆర్ టీమ్‌ను ఏర్పాటు చేసి నైతికంగా ఎటాక్ చేస్తారు.. అణచివేతకు పాల్పడతారు.. నన్నూ అలాగే తొక్కెయ్యాలని చూశారు.. అంటూ ఎమర్జెన్సీ సినిమా ప్రమోషనల్ ప్రోగ్రామ్‌లో చెప్పుకున్నారు కంగనా. గతంలో కూడా బాలీవుడ్‌లో క్యాస్టింగ్‌కౌచ్‌ని, గుత్తాధిపత్యాన్ని అనేకసార్లు ప్రశ్నిస్తూ ఫైర్‌బ్రాండ్ అనిపించుకున్నారు. తాజాగా.. కేరళలో జస్టిస్ హేమ తరహాలో తామూ బాలీవుడ్‌లో మీటూ ఎలిగేషన్లపై స్పెషల్ కమిటీ వేసి.. నివేదిక కోరే ఆలోచనలో ఉంది మహారాష్ట్ర సర్కార్. ఇదే గనుక జరిగితే.. హిందీ ఇండస్ట్రీ డొంకంతా కదిలి మురికి మొత్తం బైటికొచ్చే ఛాన్సుంది.
కేరళ ఫిలిమ్ ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల ఎపిసోడ్‌పై మలయాళ హీరో, కేంద్రమంత్రి సురేశ్ గోపీ తీవ్రంగా స్పందించారు. చారానా ముర్గీకి బారానా మసాలా వేస్తున్నారంటూ మీడియాపై విరుచుకుపడ్డారాయన. మన పట్ల సగటు ప్రేక్షకుడికుండే అభిప్రాయం చెడిపోతోంది.. మనకు మనమే మీడియాకు ఆహారం అవుతున్నాం.. అంటూ కాస్టింగ్ కౌచ్ సబ్జెక్ట్‌కు కొత్త షేపింగ్ ఇవ్వబోయారు సురేష్‌గోపీ. జస్టిస్ హేమ కమిటీ ఎపిసోడ్ రాజకీయ రంగు పులుముకుంటోంది. హేమ రిపోర్ట్‌ను మిస్‌హ్యాండిల్ చేసిందంటూ కేరళ ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. నాలుగేళ్లుగా కళ్లు మూసుకున్నారా.. మీ చేతకానితనం వల్ల టోటల్ ఇండస్ట్రీ తలదించుకోవాల్సి వస్తోంది.. ప్రతీ ఆర్టిస్టూ అవమానంగా ఫీలవుతున్నారు అంటూ విరుచుకుపడుతున్నాయి విపక్షాలు. టోటల్‌గా.. పూర్తి ఆత్మరక్షణలో పడింది కేరళ సినిమా పరిశ్రమ.
Also Read : Venu Swamy : హై కోర్టు వరకు వెళ్లిన నాగచైతన్య, శోభిత ల జాతకం వివాదం