Megastar Chiranjeevi: గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి !

గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి !

Hello Telugu - Megastar Chiranjeevi

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. ఆయన 46ఏళ్ల సినీ ప్రయాణంలో తనదైన అభినయం, డ్యాన్సులతో కోట్లాది మంది ప్రేక్షకుల్ని రంజింపజేసి ఎన్నో పురస్కారాలు, గౌరవాలు సొంతం చేసుకున్న ఆయన… తాజాగా మరో విశిష్ట గౌరవాన్ని అందుకున్నారు. ఈ ఏడాది దేశంలో రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ అందుకున్న మెగాస్టార్‌ చిరంజీవి(Megastar Chiranjeevi) మరో అరుదైన ఘనతను దక్కించుకున్నారు. మోస్ట్‌ ప్రొలిఫిక్‌ ఫిల్మ్‌ స్టార్‌ ఇన్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ యాక్టర్, డ్యాన్సర్‌ గా గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో మెగాస్టార్ చిరంజీవి చోటు సంపాదించుకున్నారు.

156 సినిమాలు… 537 పాటలు… 24వేల స్టెప్పులతో అలరించినందుకు ఆయనకు ఈ రికార్డు దక్కింది. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధి రిచర్డ్‌ స్టెన్నింగ్, బాలీవుడ్‌ మిస్టర్ ఫెర్ఫెక్ట్ అమీర్‌ ఖాన్‌ చేతుల మీదుగా చిరుకు ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి(Megastar Chiranjeevi)తో కలిసి పనిచేసిన నిర్మాతలు, దర్శకులతో పాటు పలువురు మెగా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. గత 25 రోజులుగా చికున్ గున్యాతో బాధపడుతున్న మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi)… తప్పనిసరి పరిస్థితుల్లో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి తన డ్యాన్స్‌ ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్నారు.

ఈ సందర్భంగా బాలీవుడ్ మిస్టర్ ఫెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ మాట్లాడుతూ… ‘‘చిరంజీవి(Megastar Chiranjeevi)కి నేను పెద్ద అభిమానిని. ఆయన నా పెద్దన్నయ్య లాంటివారు. ఈ వేడుకకు రావాలని నన్ను పిలిచినప్పుడు.. ‘విజ్ఞప్తి చేయడమెందుకు ఆర్డర్‌ వేయండి’ అని అన్నాను. ఈ చారిత్రక ఘట్టాన్ని ప్రత్యక్షంగా చూడటం నాకు గర్వ కారణం. చిరంజీవి కోట్లాది మంది అభిమానుల్లాగే నేనూ ఆయన్ని అమితంగా ఆరాధిస్తాను. ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించేందుకు చిరంజీవి ఒక్క స్టెప్పేస్తే చాలు. తన స్ఫూర్తి భారత దేశం దాటి చాలా దూరం చేరుకుంటుంది’’ అన్నారు. ఈ సందర్భంగా అమీర్ ఖాన్ కు మెగాస్టార్ చిరంజీవి ఓ ఖరీదైన పెన్నును కానుకగా ఇచ్చారు. స్వతహాగా రచయిత, దర్శకుడు అయిన అమీర్ ఖాన్ కు ఈ పెన్ను సరైన బహుమతి అంటూ చిరంజీవి కితాబు ఇచ్చారు.

Megastar Chiranjeevi – నేను ఎదురుచూడనిది లభించింది – చిరంజీవి

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) మాట్లాడుతూ… ‘‘నా శ్రేయోభిలాషుల సమక్షంలో ఈ వేడుక జరగడం ఆనందంగా ఉంది. ఒక్క ఫోన్‌ కాల్‌ చేసి ఆహ్వానించగానే మిత్రుడు అమీర్‌ ఖాన్‌ ఈ ఫంక్షన్‌ కు రావడం మరింత కలర్‌ఫుల్‌ గా మారింది. గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌ నేను ఊహించనిది, ఆలోచించనిది. నేను ఎదురుచూడనిది నాకు లభించింది. దానికి కారకులైన నా దర్శక, నిర్మాతలు, టెక్నీషియన్లకు, అభిమానులకు ధన్యవాదాలు. నటన కంటే ముందు డాన్స్‌లో ఓనమాలు దిద్దినట్లు అనిపిస్తోంది. డ్యాన్స్‌పై ఉన్న ఆసక్తే నాకు ఈ అవార్డు అందించిందా అనిపిస్తోంది. అప్పట్లో నాకు నటనపై కంటే డ్యాన్స్‌పైనే ఇష్టం ఎక్కువ ఉండేది. రేడియోలో పాటలు వింటూ డ్యాన్స్‌ చేస్తూ అందరినీ అలరించేవాడిని. ఎన్‌సీసీలో చేరాక… భోజనం పూర్తయ్యాక ప్లేటును కొడుతూ స్టెప్పులేసేవాడిని. తొలి సినిమా రోజుల్లో… సావిత్రి, నరసింహరాజు, రోజా రమణిలాంటి వారు నన్ను ప్రోత్సహించారు.

ఓ సారి డ్యాన్స్‌ చేస్తుండగా కాలు జారి కిందపడిపోయాను. వారంతా ‘అయ్యో..’ అంటుంటే నేను సమయస్ఫూర్తితో దాన్ని నాగిని డ్యాన్స్‌గా మార్చేశా. ఎప్పుడూ రానన్ని ప్రశంసలు దక్కాయి. అది చూసి కో- డైరెక్టర్‌… ఒకరు దర్శకుడు క్రాంతి కుమార్‌ కు ‘ప్రాణం ఖరీదు’ సినిమా సమయంలో నా డ్యాన్స్‌ గురించి చెప్పారు. దాంతో, ఆ చిత్రంలో నాకోసం ప్రత్యేకంగా డ్యూయెట్‌ క్రియేట్‌ చేశారు. ‘పునాది రాళ్లు’లోనూ డ్యాన్స్‌ విషయంలో నేను సెంట్రాఫ్‌ అట్రాక్షన్‌. ఆ స్కిల్‌ నాకు ఎంతగానో ఉపయోగపడింది. నా డ్యాన్స్‌ కోసం ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారంటూ.. అప్పటి దర్శక, నిర్మాతలకు డిస్ర్టిబ్యూటర్‌ లింగమూర్తి నన్ను రికమెండ్‌ చేేసవారు. నన్ను ఎంపిక చేసుకున్న దర్శక-నిర్మాతలు, సంగీత దర్శకులు, కొరియోగ్రాఫర్లు నా సాంగ్స్‌పై ప్రత్యేక శ్రద్థ తీసుకునేవారు’’ అని అన్నారు.

నిర్మాత అశ్వనీదత్, అల్లు అరవింద్ తో ఎప్పుడూ గొడవే – చిరంజీవి

‘‘పాటల సంఖ్య విషయంలో నిర్మాత అశ్వనీదత్‌తో నాకెప్పుడూ గొడవే (సరదాగా). ఆరు పాటలు ఉండాల్సిందే అనేవారు. అల్లు అరవింద్‌ కూడా అంతే. పాటల్ని బలవంతంగా పెట్టేవారు. కానీ, అవే నా విజయంలో కీలక పాత్ర పోషించాయి. అప్పట్లో పాటలకున్న ప్రత్యేకత నా జీవితంలో అంతర్భాగం మారి మంచి పేరు, గుర్తింపు తెచ్చిపెట్టాయి. చిన్ననాటి డాన్స్‌ అలవాటే ఈ అవార్డు తీసుకొచ్చినందుకు సంతోషంగా ఉంది’’ అని అన్నారు.

ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు అశ్వినీదత్, అల్లు అరవింద్, కె.ఎస్‌.రామారావు, తమ్మారెడ్డి భరద్వాజ, కె.రాఘవేంద్రరావు, డి.సురేశ్‌బాబు, గుణశేఖర్, బి.గోపాల్, సాయి దుర్గా తేజ్, వరుణ్‌ తేజ్, సుస్మిత, వైష్ణవ్‌ తేజ్, శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి, జెమినీ కిరణ్, రవిశంకర్, బాబీ, వశిష్ఠ తదితరులు పాల్గొన్నారు. చిరంజీవి(Megastar Chiranjeevi)కి ఈ గౌరవం దక్కడం పట్ల దర్శకుడు రాజమౌళి, గోపీచంద్‌ మలినేని తదితరులు సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

మెగాస్టార్ కు తమ్ముడు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు !

“156 చిత్రాల్లో, 537 పాటలు, 24 వేల స్టెప్పులతో అలరించిన నటుడిగా అన్నయ్య చిరంజీవి గారి పేరు గిన్నస్‌ వరల్డ్‌ రికార్డులో నమోదు కావడం ఎనలేని సంతోషాన్ని కలిగించిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా “అన్నయ్య చిరంజీవి(Megastar Chiranjeevi) పేరు గిన్నిస్‌ రికార్డుల్లో లిఖితం కావడం సంతోషదాయకం. సినీ ప్రపంచంలో రికార్డులు విజయాలు ఆయనకు కొత్త కాదు. గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో లిఖితం కావడం ఎంతో ప్రత్యేకం. ‘ద మోస్ట్‌ ప్రొలిఫిక్‌ ఫిల్మ్‌ స్టార్‌ ఇన్‌ ఇండియన్‌ సినిమా’ అని గౌరవించడం ప్రతి ఒక్కరికీ ఆనందాన్నిస్తుంది. అన్నయ్యకు హృదయపూర్వక అభినందనలు’’ అని లేఖలో పేర్కొన్నారు.

Also Read : Saree: ఆర్జీవీ ‘శారీ’నుండి రొమాంటిక్ సాంగ్ రిలీజ్ !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com