Megastar Chiranjeevi: నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ‘ఇంద్ర’ సినిమా చేయడానికి స్ఫూర్తి నందమూరి బాలకృష్ణ నటించిన ‘సమరసింహారెడ్డి’ అని చెప్పారు. “ఆ పాత్ర చేస్తే ప్రేక్షకులు, అభిమానులు అంగీకరిస్తారా లేదా అని ఎంతో ఆలోచించి అంగీకరించాను. ఎందుకంటే రాయలసీమ ఫ్యాక్షన్ సినిమాలకు బాలయ్య పెట్టింది పేరు. ఆ తరహా పాత్ర చేసి ప్రేక్షకుల్ని ఒప్పించాలంటే ఎలా అని తర్జనభర్జన పడ్డాను. కానీ ఆ కథలో ఉన్న బలం.. ‘చెయ్యి’ అంటూ ఉసిగొల్పింది. సినిమాకు అంతే ఆదరణ దక్కింది. ఇప్పుడు సీక్వెల్స్, ప్రీక్వెల్స్, పార్ట్ 1, పార్ట్ 2లుగా సినిమాలు వస్తున్న తరుణంలో ‘ఇంద్ర వర్సెస్ సమరసింహారెడ్డి’ అని రెండు పాత్రలను క్రియేట్ చేసి సినిమా మలిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. అలాంటి కథ ఉంటే యాక్ట్ చేయడానికి నేను రెడీ.. బాలయ్య మీరు రెడీనా’’ అని చిరంజీవి బాలకృష్ణను అడిగారు. ‘యెస్ .. రెడీ.. రెడీ ‘అని బాలకృష్ణ కూడా అంగీకారం తెలిపారు.
Megastar Chiranjeevi Challange
ఈ సందర్భంగా వేదిక పై నుంచి మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) దర్శకులకు ఛాలెంజ్ విసిరారు. ఇంద్రసేనా రెడ్డి, సమరసింహా రెడ్డి అనే రెండు పాత్రలను ఒకే కథలో పెట్టి మంచి స్క్రీన్ ప్లేతో ఎవరైనా వస్తారా అంటూ చిరు సవాల్ విసిరారు. ఆ సమయంలో అక్కడ చాలామంది దర్శకులు ఉన్నప్పటికీ… బోయపాటి శ్రీనులోని ఉత్సాహం గమనించిన చిరు… ‘ఏం బోయపాటి.. నువ్వు రెడీనా’ అంటూ ప్రత్యేకంగా బోయపాటి పేరు ప్రస్తావించడం మరింత ఆసక్తిని రేపింది. ఇంద్ర సేనారెడ్డి, సమరసింహారెడ్డి ఒకే కథలో కలిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వందల కోట్ల విలువైనది. కానీ దాన్ని హ్యాండిల్ చేసేంత బలమైన కథ కావాలి. బోయపాటి లాంటి దర్శకుడికి అది పెద్ద కష్టమేమీ కాదు. చిరంజీవి విసిరిన సవాల్‌ని బోయపాటి స్వీకరిస్తే ఓ అద్భుతమైన మల్టీస్టారర్‌ని చూస్తే అవకాశం తెలుగు ప్రేక్షకులకు దక్కుతుంది. సింహా, లెజెండ్, అఖండ సినిమాలతో బాలకృష్ణ కెరీర్ ను ఓ రేంజ్ కు తీసుకెళ్లి… దమ్ము, వినయ విధేయరామ వంటి ఫ్యాక్షన్ సినిమాలు తీయడంలో సిద్ధహస్తుడైన బోయపాటి స్టెప్ ఎలా ఉంటుందో చూడాలి.
Also Read : Pawan Kalyan: పవన్ అభిమానులకు నిర్మాణ సంస్థల ముఖ్య విజ్ఞప్తి !