Meenakshi Chaudhary : అలాంటి పాత్రలో చేయడం మీనాక్షి చౌదరి డ్రీమంట

మీనాక్షి కాలేజీ చదివే రోజుల్లోనే మోడలింగ్‌పై ఆసక్తి పెంచుకున్నారు...

Hello Telugu - Meenakshi Chaudhary

Meenakshi Chaudhary : తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొద్దిరోజుల్లోనే స్టార్‌నటిగా గుర్తింపు పొందారు మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary). ‘ ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చిత్రంతో తెలుగు సినిమారంగ ప్రవేశం చేసిన ఆమె ప్రస్తుతం టాలీవుడ్‌ స్టార్‌హీరోల సరసన నటిస్తోంది. ‘ గోట్‌’ సినిమాలో దళపతి విజయ్‌తో కలిసి ఆడిపాడింది. మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించి సినీనటిగా రాణిస్తున్న హర్యానా భామ మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) గురించి ఆసక్తికరమైన విషయాలు.. ‘డాక్టర్‌ కావాలనుకున్నాను కానీ యాక్టర్‌ అయ్యాను’ అని నటీనటులు చెబుతుండటం వింటూనే ఉంటాం. కానీ ఈ నటి మాత్రం డాక్టర్‌ చదివి నటిగా మారారు. హర్యానాలోని పంచకులలో జన్మించిన మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) నేషనల్‌ డెంటల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ ఇన్‌ డెంటల్‌ సర్జరీ పూర్తి చేశారు. మోడలింగ్‌పై మక్కువతో అటువైపు అడుగులు వేశారు. అంతేకాదు మీనాక్షి రాష్ట్ర స్థాయి స్విమ్మర్‌, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి కూడా. ఆమె తండ్రి బి. ఆర్‌ చౌదరి ఆర్మీలో కల్నల్‌గా పనిచేశారు.

Meenakshi Chaudhary Dream Roles..

మీనాక్షి కాలేజీ చదివే రోజుల్లోనే మోడలింగ్‌పై ఆసక్తి పెంచుకున్నారు. 2018లో ఫెమినా మిస్‌ ఇండియా గ్రాండ్‌ ఇంటర్నేషనల్‌ టైటిల్‌ గెలుచుకున్నారు. ఈ విజయంతో ఆమెకు మోడలింగ్‌లోనూ, సినీ రంగంలోనూ అవకాశాలు వెల్లువెత్తాయి. ‘ ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ తరువాత రవితేజతో ‘ఖిలాడి’, అడవి శేష్‌తో ‘హిట్‌’ సినిమాలో నటించారు. ‘ గుంటూరు కారం’ సినిమాలో మహేష్ బాబు సరసన చేసే అవకాశం రావడంతో స్టార్‌నటీమణుల జాబితాలో చేరారు. దళపతి విజయ్‌తో ‘గోట్‌’ సినిమాలో జత కట్టడంతో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ప్రస్తుతం ‘లక్కీ భాస్కర్‌’, ‘మట్కా’, ‘మెకానిక్ రాకీ’ వంటి పలు సినిమాలతో బిజీగా ఉన్నారు మీనాక్షి. మెగాస్టార్‌ మూవీ ‘విశ్వంభర’లోనూ నటిస్తున్నట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి. సినిమా అవకాశం రాకముందు ‘అవుటాఫ్‌ లవ్‌’ అనే వెబ్‌ సిరీస్‌లో నటించారామె.

2017లో ఇండియన్‌ మిలిటరీ అకాడమీ ఆటం బాల్‌ నైట్‌లో జరిగిన అందాల పోటీల్లో ‘మిస్‌ ఐఎమ్‌ఏ’గా గెలవడంతో మీనాక్షి కెరీర్‌ ప్రారంభమైంది. మిలిటరీ కేడెట్స్‌ల శిక్షణ ముగిసిన అనంతరం వారి గౌరవార్ధం ఈ ఈవెంట్‌ని నిర్వహిస్తారు. ఈ టైటిల్‌ను గెలుచుకున్న తర్వాత పాటియాలాలో ఫ్యాషన్‌ బిగ్‌బజార్‌ స్పాన్సర్‌ చేసిన ‘క్యాంపస్‌ ప్రిన్సెస్‌ 2018’ పోటీల్లో పాల్గొని ఒక రీజనల్‌ రౌండ్‌లో విజేతగా నిలిచారు. ఆ తర్వాత ఫెమినా మిస్‌ హర్యానా 2018 టైటిల్‌ను గెలుచుకున్నారు మీనాక్షి. అనంతరం భారత్‌లో జరిగే బిగ్గెస్ట్‌ బ్యూటీ కాంటెస్ట్‌గా గుర్తింపు పొందిన ఫెమినా మిస్‌ ఇండియా 2018 కిరీటాన్ని గెలుచుకున్నారు. ఈ విజయంతో అదే ఏడాది మయన్మార్‌లోని యాంగాన్‌లో జరిగిన మిస్‌ గ్రాండ్‌ ఇంటర్నేషనల్‌ పోటీలకు భారత్‌ తరపున ప్రాతినిధ్యం వహించే అవకాశం అందుకున్నారు. మిస్‌ గ్రాండ్‌ ఇంటర్నేషనల్‌ పోటీల్లో ఫస్ట్‌ రన్నరప్‌గా నిలిచారు.

షూటింగ్స్‌‌తో బిజీగా ఉండే మీనాక్షి ఖాళీ సమయం దొరికితే ట్రావెలింగ్‌కు వెళ్లడాన్ని ఇష్టపడతారు. ‘‘ కొత్త ప్రదేశాలను చుట్టి రావడమంటే చాలా ఇష్టం. నాకు కొత్త కొత్త సంప్రదాయాల గురించి తెలుసుకోవాలని ఉంటుంది. మా నాన్న ఆర్మీ ఉద్యోగి కాబట్టి ట్రావెలింగ్‌ అనేది నా జర్నీలో ఒక భాగంగా మారింది. మిస్‌ ఇండియా టైటిల్‌ గెలుచుకున్నాక దక్షిణ కొరియాతో పాటు నాకిష్టమైన మరికొన్ని దేశాలు తిరిగొచ్చాను’’ అని అంటారు మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary). అందాల పోటీల్లో విజేతగా నిలిచాక మోడలింగ్‌ రంగంలో, సినీ రంగంలో అవకాశాలు తలుపుతట్టాయి. తనకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ సినీ రంగంలో ప్రముఖ నటిగా స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.

‘‘టైటిల్‌ గెలుచుకున్నాక నాపై ఎన్నో బాధ్యతలు వచ్చి చేరాయి. ఆ సమయంలో నా తల్లిదండ్రులు, స్నేహితులు నాకు సపోర్టుగా నిలిచారు. కాస్త తీరిక దొరికినా ఫోన్‌ చేసి వాళ్లతో మాట్లాడుతూ ఉంటాను’’ అని చెబుతారు మీనాక్షి. అవకాశాలు వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలన్న సూత్రాన్ని ఆమె బాగా వంటబట్టించుకున్నారు. ‘‘ సమయం ఎవ్వరికోసం ఆగదు. అది సినిమా ఇండస్ట్రీకి మాత్రమే కాదు. అన్ని రంగాలకూ వర్తిస్తుంది. నా తల్లిదండ్రుల నుంచి ఆ విషయాన్ని నేర్చుకున్నాను’’ అని అంటారు మీనాక్షి. టైమ్స్‌ 50 మోస్ట్‌ డిజైరబుల్‌ వుమెన్‌ ఇన్‌ ఇండియా 2018 జాబితాలో మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) రెండో స్థానంలో నిలిచారు. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ఒక ఇంటర్నెట్‌ సర్వేను నిర్వహించి ఈ జాబితాను వెలువరించింది.

‘‘ప్రతి సినిమాకు నా నటనను మెరుగుపరుచుకుంటున్నాను. సినిమా ఇండస్ట్రీలో అనుష్కశెట్టి, నయనతార, త్రిష వంటి నటీమణులు నాకు ఆదర్శం. ఇండస్ట్రీలో వాళ్లు చాలా కాలం ప్రేక్షకులను అలరించారు. వాళ్లలా నేనూ గుర్తింపు తెచ్చుకోవాలి. అభిమానులు ఎప్పటికీ గుర్తుంచుకునే సినిమాల్లో నేనూ భాగం కావాలి. నాకు ఆటలంటే ఇష్టం. ఎప్పటికైనా స్పోర్ట్స్‌ రిలేటెడ్‌ మూవీలో నటించాలని ఉంది. ఒక డెంటిస్ట్‌ను కాబట్టి ఆన్‌స్ర్కీన్‌లో డాక్టర్‌ రోల్‌ కూడా చేయాలని ఉంది’’ అని తన డ్రీమ్‌రోల్స్‌ గురించి చెబుతారు మీనాక్షి చౌదరి.

Also Read : Golam OTT : మలయాళ మర్డర్ మిస్టరీ మూవీ ఇప్పుడు తెలుగు ఓటీటీలో

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com