Mansoor Ali Khan : టాలీవుడ్, కోలీవుడ్ అని తేడా లేకుండా టాప్ హీరోయిన్ త్రిషపై తాను చేసిన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తున్న నటుడు మన్సూర్ అలీఖాన్. త్రిష గురించి తాను తప్పుగా ఏం మాట్లాడలేదని… అందుకే క్షమాపణ చెప్పే అవసరం తనకు లేదని తేల్చి చెప్తున్నారు. అంతేకాదు తానేంటో తమిళ ప్రజలకు తెలుసని… వారి మద్దత్తు ఎప్పుడూ తనకు ఉంటుందని ధీమా వ్యక్తం చేసారు.
స్టైలిష్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్, త్రిష జంటగా తెరకెక్కిన ‘లియో’ సినిమాలో నటించిన మన్సూర్ అలీఖాన్(Mansoor Ali Khan)… ఇటీవల ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో “గతంలో నేను ఎన్నో రేప్ సీన్లలో నటించాను. ‘లియో’ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు త్రిషతో కూడా అలాంటి సన్నివేశం ఉంటుందని అనుకున్నాను. అయితే అలాంటి సన్నివేశం లేకపోవడంతో బాధగా అనిపించింది” అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. దీనితో మెగాస్టార్ చిరంజీవి సహా దర్శకుడు లోకేశ్ కనగరాజ్, నటి రోజా, రాధిక, గాయని చిన్మయి.. ఇలా పలువురు సినీ ప్రముఖులు వ్యాఖ్యలు ఖండిస్తూ త్రిషకు మద్దత్తు తెలుపుతున్నారు. మరోవైపు మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్… ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించి… మన్సూర్‌పై కేసు నమోదు చేయాలని తమిళనాడు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
Mansoor Ali Khan- మన్సూర్ పై పాక్షిక నిషేధం విధించిన నడిగర్ సంఘం…
త్రిషపై చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమవడంతో… మన్సూర్ అనుచితంగా మాట్లాడారంటూ దక్షిణ భారత చలన చిత్ర నటీనటుల అసోసియేషన్ (నడిగర్ సంఘం) ఆయన్ను పాక్షికంగా నిషేధించింది. తన తప్పు తెలుసుకుని త్రిషకు క్షమాపణ చెబితే బ్యాన్ తొలగించనున్నట్లు పేర్కొంది.
నడిగర్ సంఘంకు అల్టిమేటం జారీ చేసిన మన్సూర్…
దీనితో నడిగర్ సంఘం నిషేధంపై స్పందించిన మన్సూర్ చెన్నైలో మంగళవారం ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నడిగర్ సంఘం తప్పు చేసింది. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు వారు నా వివరణ అడగాలి లేదా విచారణ జరపాలి. కానీ అవేం చేయకుండా నాకు వ్యతిరేకంగా ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను వెనక్కి తీసుకునేందుకు నడిగర్ సంఘానికి నేను నాలుగు గంటలు సమయమిస్తున్నా’’ అంటూ అల్టిమేటం జారీ చేసారు. అంతేకాదు ‘సినిమాల్లో హత్య చేస్తే నిజంగానే చేసినట్లా ? సినిమాల్లో రేప్ చేస్తే నిజంగానే చేసినట్లా ?’ అంటూ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు.
Also Read : Swathi Deekshit: టాలీవుడ్ నటిపై భూ కబ్జా కేసు