Manchu Mohan Babu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని నటుడు మోహన్‌బాబు(Manchu Mohan Babu), ఆయన తనయుడు విష్ణు మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం సాయంత్రం సీఎంను కలిసిన వారు వరద బాధితుల సహాయార్థం ప్రకటించిన రూ.25 లక్షల చెక్కును అందజేశారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రిని కలిసి కాసేపు ముచ్చటించారు. అనంతరం చెక్కుని అందించి.. ఆపత్కాల సమయంలో ప్రభుత్వం ప్రజలకు అండగా నిలబడిన విధానాన్ని కొనియాడారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ విష్ణు తాజాగా పోస్ట్ పెట్టారు. ‘‘సీఎంను కలవడం చాలా సంతోషంగా ఉంది. రూ.25 లక్షల చెక్కును అందజేశాం. ‘కన్నప్ప’తోపాటు చాలా విషయాల గురించి ఆయనతో మాట్లాడా. నేను వేసిన ఆర్ట్ వర్క్‌పై ఆయన సంతకం తీసుకున్నా’’ అని పేర్కొన్నారు.
Manchu Mohan Babu Meet..
భారీ వర్షాలు, వరదలతో ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాలు అతలాకుతలమైన విషయం తెలిసిందే.తెలుగు రాష్ట్రాలలో సంభవించిన వరదలకు ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. అలాంటి వారందరికీ ఆహారం అందించేందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన పనిచేసి సాధ్యమైనంత త్వరగా పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నం చేశాయి. ఏపీలో ప్రధానంగా గుంటూరు, విజయవాడ నగరాల్లో గత 20 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత వర్షం కురిసింది. విజయవాడ నగరంలోని సింగ్ నగర్, మిల్క్ ప్రాజెక్ట్, జక్కంపూడి కాలనీ తదితర ప్రాంతాలు జలదిగ్భంధం అయిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాలకు చేయూతనందించేందుకు పలువురు సినీ ప్రముఖులు ముందుకు వచ్చారు. భారీ మొత్తంలో విరాళాలు ప్రకటించారు. ఈ క్రమంలో మోహన్‌బాబు(Manchu Mohan Babu) రూ.25 లక్షలు విరాళంగా ఇస్తానని చెప్పారు. తాజాగా ఆ చెక్కును సీఎంకు అందజేశారు.
సినిమాల విషయానికి వస్తే… మంచు విష్ణు ప్రస్తుతం ‘కన్నప్ప’ కోసం వర్క్ చేస్తున్నారు. ఇందులో మోహన్‌బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ అన్నీ సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. ఇందులో మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తుండగా, మోహన్ బాబు కూడా ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను డిసెంబర్‌లో విడుదల చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Also Read : Sonakshi Sinha: పెళ్లికి ముందు ఏడేళ్లు డేటింగ్ చేసిన బాలీవుడ్ బ్యూటీ !