Manchu Family : జల్ పల్లి నివాసం వద్ద మనోజ్‌తో జరిగిన ఘర్షణలో మోహన్ బాబు తలకు గాయం అయినట్లుగా తెలుస్తోంది. దీంతో వెంటనే ఆయనని కాంటినెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. మోహన్ బాబుని మంచు విష్ణు హాస్పిటల్లో చేర్పించారు. నేడు (బుధవారం) మోహన్ బాబు హెల్త్ బులిటెన్ విడుదల చేసే అవకాశం ఉంది. నటుడు మంచు మోహన్‌బాబు కుటుంబంలో గత మూడు రోజులుగా ఇంటి గొడవలు ఎలా రచ్చకెక్కాయో తెలిసిందే. ఆ గొడవలు ఇప్పుడు మరింత ముదిరి తారాస్థాయికి చేరాయి. మోహన్‌బాబు, ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్(Manoj) మధ్య చోటుచేసుకున్న వివాదం.. మంగళవారం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. జల్పల్లిలోని మోహన్‌బాబు(Mohan babu) నివాసం వద్ద మనోజ్ బౌన్సర్లు, మోహన్‌బాబుకు రక్షణగా ఆయన పెద్ద కుమారుడు విష్ణు నియమించిన బౌన్సర్లకు మధ్య ఘర్షణ జరిగింది. మనోజ్, మౌనికలను మోహన్‌బాబు ఇంట్లోకి రానివ్వకపోవడంతో.. మనోజ్ గేట్లు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడం ఘర్షణను మరింత పెద్దది చేసింది.
Manchu Family Dispute..
ఈ క్రమంలో ఇంట్లో నుంచి బయటికి వచ్చిన మోహన్‌బాబు(Mohan babu).. మీడియా ప్రతినిధులపై దాడి చేశారు. ఈ దాడిలో ఓ చానల్ ప్రతినిధికి ఫ్రాక్చర్ కాగా, పలువురికి గాయాలు అయ్యాయి. దీంతో జర్నలిస్టు సంఘాలు మోహన్‌బాబు వైఖరిని తీవ్రంగా ఖండించాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. మీడియాపై మోహన్ బాబు దాడిని జర్నలిస్టులు, మేధావులు, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ వంటి వారంతా ఖండించారు. మోహన్ బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మోహన్ బాబును తక్షణమే అరెస్ట్ చేయాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జల్ పల్లి ఘటనపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. రిపోర్టర్ పై మోహన్ బాబు దాడి చేయడాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖండించారు. చట్ట ప్రకారం నడుచుకుంటామని స్పష్టం చేశారు. మోహన్ కేసులో చట్టం తన పని తాను చేసుకుంటుందని స్పష్టం చేశారు.
కాగా,జల్పల్లిలో జరిగిన ఘటనను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు ఫిల్మ్‌నగర్ పోలీసులు మోహన్‌బాబు, మనోజ్ లైసెన్స్ గన్లను స్వాధీనం చేసుకొని, సీజ్ చేశారు. బుధవారం విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ మోహన్‌బాబు, మంచు మనోజ్, మంచు విష్ణులకు రాచకొండ సీపీ నోటీసులు జారీ చేశారు. మోహన్‌బాబు నివాసం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు మోహన్‌బాబు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. అంతకుముందు తన కుమారుడు మనోజ్‌ను ఉద్దేశించి మోహన్‌బాబు ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. అందులో.. మనోజ్ ప్రవర్తనను తీవ్రంగా తప్పుబట్డారు. భార్య మాటలు విని తప్పుదారి పట్టావంటూ మనోజ్‌ను నిందించారు. ఇంట్లోకి వచ్చే అధికారం, హక్కు మనోజ్‌కు లేవని, తన కష్టార్జితమైన ఆస్తిని తనకు ఇష్టంవచ్చిన వారికి రాసిస్తానని పేర్కొన్నారు.
Also Read : Bobby Deol : ఎవ్వరు ఊహించని ఓ కొత్త పాత్రలో యానిమల్ విలన్