చైల్డ్ ఆర్టిస్ట్ గా తన సినీ కెరీర్ ప్రారంభించిన కావ్య కళ్యాణ్ రామ్ ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. వేణు దర్శకత్వం వహించిన బలగం చిత్రంలో కీలక పాత్ర పోషించింది. ప్రియదర్శితో కలిసి నటించింది. ఈ సినిమా ఊహించని రీతిలో విజయం సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా ఊహించని రీతిలో అవార్డులు పొందింది. అనుకోకుండా కావ్యకు మంచి మార్కులు పడ్డాయి.
దీంతో ఈ మూవీ ఇచ్చిన సక్సెస్ ను తెగ ఎంజాయ్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. అంతే కాదు ఏ సినిమాలోనైనా నటించేందుకు తాను రెడీ అంటోంది. బుల్లి తెరతో పాటు వెండి తెరపై ఎలాంటి పాత్ర ఇచ్చినా ఓకే చెబుతానంటోంది కావ్య కల్యాణ్ రామ్.
ఈ లవ్లీ గర్ల్ వయసు 25 ఏళ్లు. జూలై 20, 1998లో తెలంగాణలోని కొత్తగూడెం స్వస్థలం. అల్లు అర్జున్ నటించిన గంగోత్రి మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా మెరిసింది. ఇందులో వల్లంగి పిట్టా వల్లంగి పిట్టా మెల్లంగ రమ్మంటా అనే పాటలో ఆకట్టుకుంది కావ్య కళ్యాణ్ రామ్. అంతే కాదు చిరంజీవి ఎత్తుకుని దించాడు ఈ బుట్టబొమ్మను. శాస్త్రీయ నృత్య కారిణిగా గుర్తింపు పొందింది. లా చదివింది. ఆ తర్వాత కొన్ని షార్ట్ ఫిలింలలో నటించింది.
తను గంగోత్రి, స్నేహమంటే ఇదేరా, ఠాగూర్ , అడవి రాముడు, విజయేంద్ర వర్మ, బాలు, బన్నీ, సుభాష్ చంద్రబోస్ , పాండు రంగడు వంటి పలు చిత్రాలలో నటించింది. 2022లో సాయి కిరణ్ దర్శకత్వం వహించిన హర్రర్ మూవీ మసూదలో కీ రోల్ పోషించింది. ఉస్తాద్ లో మెరిసింది. కానీ గతంలో లేనంతగా ఎక్కువగా పేరు తెచ్చిన చిత్రం బలగం.