Kamal Haasan : నటుడిగా 65 ఏండ్లు పూర్తి చేసుకున్నారు ఉలగనాయగన్ కమల్ హాసన్. ఆయన తొటిసారి కెమెరా ముందుకు వచ్చి నటించిన తొలి చిత్రం కన్నమ్మ విడుదలై నేటికి సరిగ్గా 65 సంవత్సరాలు కావస్తోంది. కలత్తూర్ కన్నమ్మ సినిమాతో నటుడిగా ప్రస్థానాన్ని మొదలుపెట్టిన కమల్ హాసన్.. తొలి సినిమాతోనే జాతీయ స్థాయిలో ఉత్తమ బాలనటుడి అవార్డ్ సాధించగా ఆపై బాలనటుడిగా శివాజీ గణేశన్, ఎంజీఆర్, జెమినీ గణేషన్ లాంటి తమిళ అగ్రనటులతో కలసి పనిచేశారు. యుక్త వయస్సుకు వచ్చాక సినిమాల్లో డాన్స్ డైరెక్టర్, ఫైటర్‌గా కూడా పనిచేశారు. ఆ తర్వాత భాషాబేధం లేకుండా నటుడిగా తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమాలను చేస్తూ ప్రతి చోటా తనకంటూ ప్రత్యేక అభిమానులను సంపాదించుకున్నాడు..
Kamal Haasan…
1974లో మలయాళంలో వచ్చిన కన్యాకుమారీ కమల్(Kamal Haasan)ను హీరోగా నిలబెట్టింది. తెలుగులో అంతులేని కథ, మరో చరిత్ర సినిమాలతో స్టార్‌గా ఎదిగారు. అనంతరం స్వాతి ముత్యం, సాగర సంగమం, ఇంద్రుడు చంద్రుడు వంటి సినిమాల్లో నటనకు మూడు నంది అవార్డులను అందుకున్నారు కమల్ హాసన్. హిందీలో కూడా ఏక్ దూజే కే లియే, గిరఫ్తార్, రాజ్ తిలక్ వంటి పలు సినిమాలతో నటించారు. ఇప్పటివరకుజాతీయ స్థాయిలో మూడు సార్లు ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. భామనే సత్యభామనే సినిమాలో ఆడ వేషంలో, విచిత్ర సోదరులు సినిమాలో పొట్టివాడిగా నటించినా.. కమల్ ఆయా పాత్రలో ఒదిగిపొయి అధ్బుతమైన నటనను కనబరిచారు. దశావతారం సినిమాలో పది పాత్రలతో మెప్పించారు. కమర్షియల్ సినిమాల్లోనూ ప్రయోగాలు చేశారు. పూర్తి ప్రయోగాత్మక సినిమాలు చేసి మెప్పించారు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన పుష్పక విమానం అలాంటిదే. మూకీ కమ్ స్లాప్ స్టిక్ కామెడీగా ఈ మూవీ అద్బుతమైన విజయాన్ని అందుకుంది.
మణిరత్నం దర్శకత్వంలో నాయకుడు చిత్రంలో కమల్(Kamal Haasan) నటన మరో వండర్. అన్ని వయసుల పాత్రలను అద్భుతంగా పోషించి నటుడిగా మరో స్దాయికి ఎదిగారు. ఈ సినిమా టైమ్ మాగ్జైన్ వారి ఆల్ టైం బెస్ట్ హండ్రెడ్ మూవీల్లో ఒకటిగా నిలిచింది. డైరెక్టర్ గాను ఓ ఆరు చిత్రాలకు దర్వకత్వం వహించడంతో పాటు రాజ్ కమల్ బ్యానర్‌పై సినిమాలు నిర్మించారు. దశాబ్ద కాలంగా వరుస ప్లాప్‌లతో కమల్ హాసన్ పనైపోయిందుకున్న టైమ్‌లో విక్రమ్ సినిమాతో తిరిగి ఫామ్‌లోకి వచ్చి వరుస సినిమాలను లైన్‌లో పెట్టారు. ఇటీవలే విడుదలైన భారతీయుడు 2 సినిమా పరాజయం పాలైంది. ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో థగ్ లైఫ్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక ఎప్పటినుంచో కమల్(Kamal Haasan) డ్రీమ్ ప్రాజెక్టు మరుదనాయగం పూర్తి కాకుండా మధ్యలోనే నిలిచిపోయింది. నటుడిగా కమల్ ఇప్పటివరకు 175కు పైగా అవార్డులు పొందగా.. అందులో పద్దెనిమిది ఫిలింఫేర్ అవార్డులు ఉండడం విశేషం. ఉత్తమ బాల నటుడిగా ఒకటి, ఉత్తమ నటుడిగా మూడు జాతీయ అవార్డులు గెలుపొందారు. 1990లో పద్మశ్రీ, 2014లో పద్మభూషణ్ గౌరవాన్ని అందుకున్న కమల్ హాసన్ 69 ఏళ్ల వయస్సులో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే కమల్ 65 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆయన తాజాగా మణిరత్నం దర్శకత్వంలో నటిస్తున్న థగ్ లైఫ్ చిత్ర షూటింగ్‌లో కమల్‌హసన్ నడిచి వస్తుండగా అంతా నిలబడి చప్పట్లు కొడుతూ ప్రత్యేకంగా వెల్‌కమ్ చెప్పడంతో పాటు ఓ పోస్టర్‌ను రిలీజ్ శుభాకాంక్షలు తెలిపారు.
Also Read : Harish Shankar : ‘మిస్టర్ బచ్చన్’ సినిమా చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తుంది