Janhvi Kapoor: సినిమా ఇండస్ట్రీలో హీరోకైనా, హీరోయిన్ కైనా, విలన్ కైనా డెడికేషన్ చాలా ముఖ్యం. సినిమాలో తన పాత్రకు న్యాయం చేసేవరకు నటులు తమని తాము మార్చుకునే తీరు అభిమానులను ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. హీరోల మాట ఎలాగున్నా… హీరోయిన్లకు మాత్రం చాలా కష్టం. తమ పాత్ర కోసం తమ శరీరాన్ని మలచుకునే క్రమంలో గ్లామర్ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. సాధారణ హీరోయిన్ల మాట ఎలాగున్నా… అందం, అభినయంలో అగ్రస్థానంలో ఉన్న హీరోయిన్లకు ఇది మరింత కష్టం.
అయితే అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన జాన్వీ కపూర్(Janhvi Kapoor).. తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందేందుకు అహర్నిశలు శ్రమిస్తోంది. దీనిలో భాగంగా శరణ్ శర్మ దర్శకత్వంలో రాజ్‌కుమార్‌తో కలిసి ఆమె నటిస్తున్న రొమాంటిక్ స్పోర్ట్స్ డ్రామా ‘మిస్టర్ అండ్ మిస్సెస్ మహి’ చాలా కష్టపడినట్లు తెలుస్తోంది. మే 31న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో క్రికెటర్‌గా కనిపించేందుకు జాన్వీ కపూర్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంది. అది ఓ వారమో, పది రోజులో కాదు. ఏకంగా 150 రోజుల పాటు శిక్షణా కార్యక్రమాలు జరిగినట్లు తాజాగా పంచుకున్న వీడియోలో తెలిపింది. 30 రోజుల సినిమా షూటింగ్ కోసం 150 రోజుల పాటు ట్రైనింగ్ తీసుకోవడమే కాకుండా రెండు సార్లు గాయాల పాలయినట్లు ఆమె వెల్లడించింది.
‘మిస్టర్ అండ్ మిస్సెస్ మహి’ సినిమా కోసం తాను పడిన కష్టాన్ని వివరిస్తూ ఓ వీడియోను జాన్వీ కపూర్(Janhvi Kapoor) విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా కోసం ‘మిలీ’ సినిమా షూటింగ్ సమయంలోనే శిక్షణ ప్రారంభించాను. నా కోచ్‌లు నన్ను పూర్తి క్రికెటర్‌గా మార్చారు. నిజానికి వీఎఫ్‌ఎక్స్‌తో దర్శకుడు అనుకున్న సన్నివేశాలను చిత్రీకరించొచ్చు. కానీ, ఆయన ప్రతీ సీన్ సహజంగా ఉండాలని కోరుకున్నారు. అందుకే అలా చేయలేదు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో నాకు ఎన్నో గాయాలయ్యాయి. రెండు భుజాలు పనిచెయ్యవేమో అనుకున్నా. నా ఇద్దరు కోచ్‌లు క్రికెట్ నేర్పడం కోసం ఎంతో కష్టపడ్డారు. ఈ చిత్రం విడుదలయ్యాక నా పాత్రకు వచ్చే ప్రశంసలన్నీ వాళ్లకే దక్కుతాయి. ఎన్నోసార్లు ఈ సినిమా నుంచి వైదొలగాలని భావించా. వాళ్లు నాకు ధైర్యం చెప్పారు’ అని జాన్వీ వెల్లడించింది.
Janhvi Kapoor – ‘మిస్టర్ అండ్ మిస్సెస్ మహి’ సినిమా కథేమిటంటే ?
మహేంద్ర (రాజ్‌కుమార్ రావ్) క్రికెటర్‌గా ఉన్నత స్థానాలకు ఎదగలేకపోతాడు. మహిమ (జాన్వీకపూర్) వైద్యురాలు. పెద్దలు కుదిర్చిన వివాహ బంధంతో ఒక్కటవుతారు. ఒకరి ఇష్టాలను మరొకరు తెలుసుకునే క్రమంలో ఇద్దరికీ క్రికెట్ అంటే ప్యాషన్ అని అర్థమవుతుంది. దీనితో తన భార్యలో ఉన్న టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు శిక్షణ ఇవ్వడం మొదలు పెడతాడు. మరి, ఆమె కలను సాకారం చేసే క్రమంలో మహికి ఎదురైన సమస్యలు ఏంటి? వాటిని ఎలా ఇద్దరూ ఎదుర్కొన్నారు. మహి క్రికెట్ జర్నీ ఎంత వరకూ వెళ్లింది? అన్నది తెలియాలంటే మే 31న విడుదల కాబోతున్న ఈ సినిమా చూడాల్సిందే!
Also Read : Mahesh Babu : కొడుకు గ్రాడ్యుయేషన్ వేడుకల్లో మహేష్ బాబు, నమ్రత