హాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్న జగపతిబాబు ?
Jagapathi Babu : ఫ్యామిలీ సినిమాల హీరోగా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుని… సెంకడ్ ఇన్నింగ్స్ లో పవర్ ఫుల్ విలన్ రోల్స్ తో హీరోలకు మించి క్రేజ్ తెచ్చుకున్న నటుడు జగపతిబాబు. గాయం, అంతఃపురం, మావిచిగురు, శుభలగ్నం, శుభాకాంక్షలు, పెళ్ళైన కొత్తలో వంటి సినిమాలతో ప్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయిన జగపతిబాబు…. లెజెండ్ తో ప్రతినాయకుని పాత్రలో లెజెండ్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.
అప్పటివరకు ఫ్యామిలీ చిత్రాలతో హీరోగా తన సహజ నటనతో అలరించిన జగపతి బాబు… ఒక్కసారిగా పవర్ ఫుల్ విలన్ పాత్రలో అదరగొట్టేశారు. దీనితో జగపతిబాబుకు(Jagapathi Babu) ప్రతినాయకుడిగా… సహాయ నటుడిగా అవకాశాలు క్యూ కట్టాయి. లెజెండ్, నాన్నకుప్రేమతో, రంగస్థలం వంటి సినిమాల్లో విలన్ గా మెప్పించడంతో పాటు శ్రీమంతుడు వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సక్సెస్ ఫుల్ గా సెకండ్ ఇన్నింగ్స్ ను కొనసాగిస్తున్నారు. చేతినిండా సినిమాలతో ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లో బిజీ బిజీగా ఉన్న జగ్గూభాయ్… త్వరలో హాలీవుడ్ లో అడుగుపెట్టడానికి సిద్ధపడుతున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. దీనికి ఇటీవల ఆయన ఇన్ స్టా వేదికగా పెట్టిన ఫోటోలు, క్యాఫ్షన్ లు బలం చేకూర్చుతున్నాయి.
Jagapathi Babu – హాలీవుడ్ లుక్స్ తో జగ్గూభాయ్ కొత్త ఫోటోలు…
టాలీవుడ్ నుండి కోలీవుడ్ కు అటునుండి అటే బాలీవుడ్ కి వెళ్ళి చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న జగ్గూభాయ్ కు… హాలీవుడ్ కూడా స్వాగతం పలుకుతుంది అనే విధంగా తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ ఫోటో షేర్ చేశారు. ఈ ఫోటోలో బ్లాక్ జాకెట్, బ్లాక్ క్యాప్, కళ్లను బ్లాక్ గాగుల్స్ పెట్టుకుని, పొగలు కక్కే సిగరెట్ నోట్లో పెట్టుకుని అచ్చం హాలీవుడ్ నటుడి మాదిరిగా జగ్గూభాయ్(Jagapathi Babu) కనిపిస్తున్నారు. దీనికి తోడు ఈ ఫోటోకు “హాలీవుడ్ పిలుస్తోంది.. ఏమంటారు?” అని క్యాప్షన్ పెట్టడంతో… జగ్గూభాయ్ హాలీవుడ్ లో అడుగుపెట్టడం ఖాయమని అందరూ పోస్టులు పెడుతున్నారు. హాలీవుడ్ లో అడుగు పెట్టి తెలుగు వాడి కీర్తి ప్రపంచ స్థాయిలో చాటాలని కొంతమంది నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు.
అసాధ్యులు నుండి హాలీవుడ్ కు జగ్గూభాయ్
ప్రముఖ తెలుగు సినీ నిర్మాత, దర్శకుడు అయిన వి.బి.రాజేంద్రప్రసాద్ కుమారుడిగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన జగపతిబాబు 1992లో అసాధ్యులు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. అంతఃపురం, మావిచిగురు, శుభలగ్నం, శుభాకాంక్షలు, గాయం, హనుమాన్ జంక్షన్, పెళ్ళైనకొత్తలో వంటి అద్భుతమైన కుటుంబ కథా చిత్రాల్లో నటించి ఫ్యామిలీ ఆడియన్స్ కు ముఖ్యంగా మహిళాభిమానులకు దగ్గరయ్యారు. అయితే 2014లో ప్రతినాయకుడి పాత్రలో లెజెండ్ సినిమాలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన జగపతిబాబు… అతి తక్కువ కాలంలో హీరో కంటే విలన్ గా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం కేజిఎఫ్ సిరీస్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న సలార్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమాలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.
Also Read : Super Star Rajanikanth: డిసెంబరు 2న వస్తున్న తలైవా ‘ముత్తు’