Hrithik Roshan: ‘వార్’, ‘పఠాన్’ ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్లు హృతిక్ రోషన్(Hrithik Roshan), దీపికా పదుకొణె, అనిల్‌కపూర్ ప్రధాన పాత్రల్లో విడుదలైన తాజా సినిమా ‘ఫైటర్’. వయాకామ్ 18 స్టూడియోస్, మార్ ఫ్లిక్స్ పిక్చర్స్ బ్యానర్‌పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందించిన ఈ సినిమాను రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసారు. ‘ఫైటర్’ సినిమాలో హృతిక్.. స్క్వాడ్రన్ లీడర్ షంషేర్ పఠానియాగా కనిపించగా… దీపిక పదుకొణె స్క్వాడ్రన్ లీడర్ మిన్నిగా, గ్రూప్ కెప్టెన్ రాకేష్ జై సింగ్ పాత్రలో అనిల్ కపూర్ కనిపించారు.
Hrithik Roshan Fighter Movie Updates
ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాపై మిడిల్ ఈస్ట్ దేశాలు నిషేధం విధించాయి. మిగతా ప్రాంతాల నుంచి కూడా ఈ సినిమాకు నెగెటివ్ టాక్ రావడంతో దాని ప్రభావం వసూళ్లపై బాగా చూపించింది. తాజాగా ఈ సినిమా మరో వివాదంలో చిక్కుకుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డ్రెస్ లో ఉంటుండగా…. సినిమాలో హీరోహీరోయిన్ల మధ్య వచ్చిన లిప్ కిస్ సీన్ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి, వింగ్ కమాండర్ సౌమ్య దీప్ దాస్ ఫిర్యాదు చేసారు. దీనితో సౌమ్య దీప్ దాస్ ఫిర్యాదు మేరకు చిత్ర నిర్మాతలకు లీగల్ నోటీసులు వచ్చాయి.
‘ఫైటర్’ సినిమాలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యూనిఫామ్ లో హీరోహీరోయిన్లు లిప్ కిస్ పెట్టుకోవడాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి, వింగ్ కమాండర్ సౌమ్య దీప్ దాస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. యూనిఫామ్ లో ఇలా మూతి ముద్దులు పెట్టుకోవడం, భారత వైమానిక దళం, అందులోని అధికారుల పరువు తీసిందని, ఇది తీవ్ర అవమానమని, ఎయిర్ ఫోర్స్ పై ప్రతికూల ప్రభావం చూపుతుందంటూ ఆమె నోటీసులో పేర్కొన్నారు.
ఎయిర్ ఫోర్స్ యూనిఫాం అనేది కేవలం డ్రెస్ మాత్రమే కాదని… అది దేశ గౌరవమని, నిస్వార్థ సేవకు గుర్తు అని, నిబద్ధతకు చిహ్నమని నోటీసులో పేర్కొన్నారు. అలాంటి పవిత్రమైన దుస్తులు ధరించి, లిప్ కిస్ పెట్టుకోవడాన్ని సదరు అధికారి తీవ్రంగా నిరశించారు. ఇలాంటి అనుచితమైన ప్రవర్తనలు ఎయిర్ ఫోర్స్ ఔన్నిత్యాన్ని దెబ్బతీస్తాయని ఆమె అన్నారు. కేవలం నైతికంగానే కాకుండా, సాంకేతికంగా కూడా కొన్ని కామెంట్స్ చేశారు సౌమ్య. ఎయిర్ ఫోర్స్ కు చెందిన రన్ వేను అత్యంత సున్నితమైన ప్రాంతంగా పరిగణిస్తారని, ఎంతో భద్రతతో కూడిన అలాంటి రన్ వేపై శృంగారభరితంగా కనిపించడం తప్పు అంటున్నారు. ఈ సినిమా చూసి భవిష్యత్తులో ఎవరైనా రన్ వే పై అలా ప్రవర్తిస్తే, దానికి బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. అయితే ఈ నోటీసులపై ఫైటర్ నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి.
Also Read : Varun Dhawan: వరుణ్ ధావన్ ‘బేబీ జాన్’ రిలీజ్ డేట్ ఫిక్స్ !