‘హాయ్ నాన్న’తో దర్శకుడిగా మారిన విజయేంద్ర ప్రసాద్ శిష్యుడు
Hi Nanna : బాహుబలి సిరీస్ , RRR, బజరంగీ భాయిజాన్, మణికర్ణిక, మగధీర, మరియు మెర్సల్ లాంటి సూపర్ డూపర్ హిట్ లను అందించిన ఇండియన్ స్క్రీన్ రైటర్ విజయేంద్రప్రసాద్. దర్శక ధీరుడు, ఆస్కార్ విన్నర్ రాజమౌళి సినిమాలకు తన తండ్రి విజయేంద్రప్రసాద్ కథలే బలం. అటువంటి బలమైన కధకుడి వద్ద శిష్యరికం చేసి టాలీవుడ్ డైరెక్టర్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ‘హాయ్ నాన్న(Hi Nanna)’ వస్తున్నారు యువ దర్శకుడు శౌర్యువ్.
Hi Nanna – విజయనగరం నుండి విజయేంద్రప్రసాద్ వద్దకు
తన మొదటి చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా యువ దర్శకుడు పలు వ్యక్తిగత విషయాలు పంచుకున్నారు. విశాఖపట్నంలో పుట్టి పెరిగిన తాను విజయనగరంలో మెడిసిన్ పూర్తి చేసానన్నారు. ఆరో తరగతి చదివే సమయంలోనే ఓ కథ రాసిన తాను, ఏడో తరగతిలో ఉన్నప్పుడు దర్శకుడుకావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
తన తల్లి సలహా మేరకు మెడిసిన్ పూర్తయ్యాక చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి ముందుగా విజయేంద్ర ప్రసాద్ దగ్గర రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో చేరి చాలా విషయాలు నేర్చుకున్నానన్నారు. ‘ఆదిత్య వర్మ’ (అర్జున్ రెడ్డి తమిళ్ రీమేక్)లాంటి ఎన్నో సినిమాలకు పని చేసినతాను డైరెక్టర్‌కావాలనే ప్రయత్నంలో భాగంగా వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాతలకు ‘హాయ్ నాన్న’ కథ చెప్పారన్నారు. వారు హీరో నానికి వినిపించమని చెప్పడం… వెంటనే నాని ఓకే చెప్పడంతో తన మొదటి సినిమా పట్టాలెక్కిందన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ “ఏదైనా సినిమా తెరకెక్కించాలంటే డైలాగ్స్, విజువల్స్‌లాంటి అంశాల కంటే కథ ముఖ్యమనే విషయం ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ దగ్గర పనిచేస్తున్న సమయంలో నేర్చుకున్నానని… ‘హాయ్ నాన్న(Hi Nanna)’ సినిమా చేస్తున్న సమయంలో అది మరింత బాగా అర్థమైందని” దర్శకుడు శౌర్యువ్ అన్నారు. ‘హాయ్ నాన్న’ సినిమాలో ‘‘ఎమోషన్స్ తప్ప ఇందులో ఎలాంటి యాక్షన్, ఇతరత్రా అంశాలు ఉండవు’’ అని తెలిపారు.
డిసెంబరు 7 వస్తున్న ‘హాయ్ నాన్న’
వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మోహన్ చెరుకూరి, విజయేంద్రరెడ్డి తీగల, మూర్తి కె ఎస్ నిర్మాతలుగా నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘హాయ్ నాన్న’. యువదర్శకుడు శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు హేసమ్ అబ్ధుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నారు. డిసెంబరు 7 ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేస్తున్న ఈ చిత్రానికి నాని, మృణాల్ ఠాకూర్ చేస్తున్న ప్రచారానికి దేశవ్యాప్తంగా విశేష స్పందన వస్తుంది.
Also Read : Balakrishna: దమ్ము – ధైర్యంకు కేరాఫ్ నందమూరి బ్లడ్