Hero Vijay: కోలీవుడ్ స్టార్ విజయ్… రాజకీయ రంగప్రవేశం చేసారు. ‘తమిళగ వెట్రి కళగం’ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేసిన విజయ్… ఈ ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోమని ఇప్పటికే స్పష్టం చేశారు. అంతేకాదు ఇతర పార్టీలకు మద్దతు కూడా ఇవ్వబోమన్నారు. 2026లో జరిగే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బరిలోకి దిగుతామని వెల్లడించారు. దీనితో ఇప్పటికే అంగీకరించిన విజయ్ సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. ప్రస్తుతం విజయ్… కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (గోట్) లో నటిస్తున్నారు. ఏజీఎస్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ సినిమాలో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. మీనాక్షి చౌదరి, ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహా, లైలా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలో తాను నటించే 169వ చిత్రం ప్రారంభం కానుంది.
Hero Vijay….
సినిమాల విషయం అలా ఉంచితే… విజయ్(Hero Vijay) తన తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నారనే వార్త చాలా కాలంగానే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నిజానికి విజయ్ కు తన తల్లి శోభ అంటే చాలా ఇష్టం. ఎంతగా అంటే ఆమె కోసం ఆలయాన్ని కట్టించేంతగా అని మాట. అవును విజయ్ తన తల్లి కోసం చెన్నైలోని స్థానిక కొరట్టూర్‌లో తన స్థలంలో సాయిబాబా గుడిని కట్టించారనే ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఆలయ కుంభాభిషేకం కూడా గత ఫిబ్రవరి నెలలో నిర్వహించారట. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్ చిత్రం షూటింగ్ గ్యాప్‌లోనూ విజయ్… సాయిబాబా ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు సమాచారం. అయితే విజయ్ ఇంతవరకు ఎక్కడా ఈ గుడి కోసం అధికారికంగా వివరాలు వెల్లడించలేదు.
Also Read : Keerthy Suresh: డైరెక్ట్ గా ఓటీటీలోకి కీర్తి సురేశ్ ‘సైరన్’ సినిమా !