పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన ‘హరిహర వీరమల్లు’ యూనిట్ !
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘హరిహర వీరమల్లు’. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా… నిధి అగర్వాల్, అర్జున్ రాంపాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో పవన్ వీరోచిత బందిపోటుగా కనిపించనున్నట్లు సమాచారం. దాదాపు రెండేళ్ళ క్రితం ప్రారంభమైన ఈ సినిమా కోవిడ్ కారణంగా షూటింగ్ లో జాప్యం జరిగింది. దీనికి తోడు పవన్ కళ్యాణ్ అటు రాజకీయాల్లో బిజీగా ఉండటంతో పాటు… అంతకుముందు కమిట్ అయిన సినిమాలతో కాల్షీట్లు ఖాళీ లేకపోవడంతో మధ్యలో దర్శకుడు క్రిష్… మరో మెగా ఫ్యామిలీ హీరో వైష్ణవ్ తేజ్ తో కొండపొలం అనే సినిమాను తెరకెక్కించారు. అయితే గత కొంతకాలంగా ఈ ‘హరిహర వీరమల్లు’ సినిమా గురించి ఎటువంటి అప్ డేట్ లేకపోవడంతో… ఈ సినిమా ఆగిపోయిందా అనే అనుమానాలు, పుకార్లు సోషల్ మీడియాలో షికార్లు చేసాయి.
అయితే ‘హరిహర వీరమల్లు’ సినిమాకోసం ఆశక్తిగా ఎదురుచూస్తున్న పవన్ అభిమానులకు చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా గుడ్ న్యూస్ చెప్పింది. ‘‘ఈ సినిమా వీఎఫ్‌ఎక్స్ పనులు ఇరాన్, కెనడా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లో జరుగుతున్నాయి. ఈ చిత్రం మీ ఊహకు మించి ఉండనుంది. మిమ్మల్ని సీటు అంచున కూర్చోబెట్టే ప్రోమోను త్వరలోనే విడుదల చేస్తాం. అప్పటివరకు వేచి చూడండి’’ అంటూ చిత్ర నిర్మాణసంస్థ మెగా సూర్య ప్రొడక్షన్స్ సోషల్ మీడియా వేదికగా పవన్ ఫ్యాన్స్, సినీ ప్రియులకు విజ్ఞప్తి చేసింది. దీనితో మెగా సూర్య ప్రొడక్షన్స్ పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ‘హరిహర వీరమల్లు’ అప్ డేట్ తో పవన్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.