Megastar Chiranjeevi : ఇప్పుడాయన మెగాస్టార్ కావచ్చు, పద్మవిభూషణ్ కావచ్చు.. కానీ నటుడిగా ఆయన జీవితం పూల పాన్పు కాదు. అవకాశాలు అందుకునే సమయంలో ఎన్నో ఒడిదొడుకులు, అవమానాలు. హేమాహేమీల మధ్య కొత్త ప్రయాణం, అన్ని తట్టుకుని, తనకు తానే నిరూపించుకుని, నిలదొక్కుకుని మెగాస్టార్(Megastar Chiranjeevi) స్థాయికి చేరుకున్నారు. కష్టం, అంకితభావం, చేసే పనిని దైవంగా భావించే గుణం.. ఆయన్ని సక్సెస్ బాటలో నిలిపాయి. కోట్లాదిమంది అభిమానుల ఆదరణ, ప్రేమాభిమానాలు ఆయన సొంతం. హిట్‌ఫ్లాప్‌లతో సంబంధిం లేని స్టార్‌డమ్ ఆయనది. ఎదిగేకొద్దీ ఒదిగి ఉండాలనేది ఆయన ఫార్ములా.. ఆ ఫార్ములాను తూచ తప్పకుండా పాటిస్తారు. అదే టాలీవుడ్‌కి మెగాస్టార్‌గా నిలబెట్టాయి. దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమకు రారాజుగా నిలిచారు. నేడు ఆయన పుట్టినరోజు(Birthday) సందర్భంగా ఆయన కెరీర్‌లో పలు ఆసక్తికర విషయాలపై ఓ లుక్కేద్దాం.
Megastar Chiranjeevi Birthday…
చిత్ర పరిశ్రమలోకి రాకముందు చిరంజీవి(Megastar Chiranjeevi) సుధాకర్, హరి ప్రసాద్‌లతో కలిసి మద్రాస్‌లో ఓ గదిలో ఉండేవారు. ‘ పూర్ణా పిక్చర్స్’ సంస్థ పంపిణీ చేసే సినిమాల ప్రివ్యూలు చూసి, వాటి రివ్యూలు చెప్పడం అప్పట్లో వారి పని. అలా ఓ సినిమా చూడడానికి వెళ్లిన వారు ముందు వరుసలో కూర్చొన్నారు. అదే సమయంలో.. సినిమాలోని హీరో డ్రైవర్, మేకప్‌మ్యాన్ తదితరులు వచ్చి, ఆ ముగ్గురి స్థ్థానంలో కూర్చొనే ప్రయత్నం చేశారు. ఏం చేయాలో తెలియని చిరంజీవి టీమ్ నిల్చొనే మూవీ చూసింది. ‘ సినిమా ఎలా ఉంది?’ అని పూర్ణ పిక్చర్స్ అధినేత సతీమణి అడగ్గా.. ‘ఆంటీ.. మీ అతిథులుగా మేం అక్కడకు వెళ్లాం. కానీ, ఆ హీరో మమ్మల్ని డోర్ దగ్గర నిలబెట్టాడు. తిరిగి వచ్చేేస్త మీకు చెడ్డపేరు వస్తుందని ఓపికగా ఉన్నాం. ఈ ఇండస్ట్రీ లో నంబరు 1 హీరోని కాకపోతే నన్ను అడగండి’ అని ఆవేశంతో అన్నారట చిరు. అన్నట్టుగానే ఆ స్థ్థాయికి చేరుకున్నారు.
చిత్రసీమలో అడుగుపెట్టిన ప్రతీ ఒక్కరూ ఏదో ఒకటి నేర్చుకొంటూనే ఉంటారు. కానీ చిత్రసీమకే కొత్త పాఠాలు నేర్పారు. మాస్ సినిమా అర్థం మార్చిన హీరో చిరంజీవి. కమర్షియాలిటీని ట్రాక్‌లోకి తెచ్చిన హీరోయిజం చిరంజీవి(Megastar Chiranjeevi) సొంతం. ఇప్పుడు తెలుగు సినిమా మార్కెట్, స్థాయి పెరిగిందని సంబరపడుతున్నాం కానీ, ఆ ప్రయాణానికి తొలి అడుగు వేసిన హీరో చిరంజీవి. తెలుగు సినిమాకు తొలి రూ.5 కోట్ల వసూళ్లు, తొలి పది కోట్ల అంకెలు చూపించింది చిరంజీవి. అంతే కాదు అప్పట్లోనే కోటి రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్న తొలి హీరోగా చిరంజీవి నిలిచారు. బిగ్గర్ దేన్ బచ్చన్ అని గుర్తింపు పొందారు. డాన్స్ లతో సరికొత్త ట్రెండ్‌ను సృష్టించారు. బ్రేక్ డాన్స్ కు శ్రీకారం చుట్టిన ఆయన ఆ స్టెప్పులతోనే గుర్తింపు పొంది కెరీర్‌లో ఒక్కో స్టెప్పు ఎక్కారు. చిరంజీవి తాను ఎదగడమే కాదు చుట్టూ ఉన్నవాళ్లను ఎదిగేలా తోడ్పాటు అందించారు.
చిరంజీవిని(Megastar Chiranjeevi) చూసి ‘మనం కూడా హీరోలైపోవొచ్చు’ అని ధైర్యం తెచ్చుకొని, హీరోలై, స్టార్‌డమ్ సంపాదించుకున్న వాళ్లు ఎంతోమంది ఉన్నారు. నేటితరం యువ హీరోలకు కూడా ఆయన స్ఫూర్తి. ఇండస్ట్రీలో చిరంజీవి స్థాయి వేరు. ఆయన స్థానం వేరు అంటారు ఆయన అభిమానులు. అయితే చిరు అందరివాడే కానీ, అందనివాడు మాత్రం కాదు. సాధారణంగా అలాంటి స్టార్‌ని కలవాలంటే ఎంతో కష్టం. కానీ చిరు అందరికీ అందుబాటులో ఉంటాడు. ‘ జబర్దస్ట్’ ఆర్టిస్ట్‌లు సైతం చిరుని సులభంగా కలుసుకోగలరు. కష్టాన్ని నమ్ముకున్న వారిని చిరంజీవి ఎప్పుడూ గౌరవిస్తారు. స్థాయితో సంబంధం లేకుండా పేరుపేరున పలకరిస్తారు. అన్నయ్య అంటే అభయహస్తం ఇచ్చే వ్యక్తిత్వం ఆయనది. ద్వేషించిన వారిని సైతం ప్రేమించగలిగే మనసు ఉండటం ఆయనకే సాధ్యం.
1989 మార్చి 24న జరిగిన ఆస్కార్ వేడుకలో పాల్గొన్న చిరంజీవి(Megastar Chiranjeevi)కి మరో అరుదైన అవకాశం దక్కింది. అది జరిగిన రెండు నెలలకు మాస్కో వెళ్లే అవకాశం వచ్చింది. జూలై 7 నుంచి 18 వరకూ జరిగిన మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్‌లో చిరంజీవి నటించిన మూడు చిత్రాలు ‘స్వయంకృషి’, ‘రుద్రవీణ’, ‘పసివాడి ప్రాణం’ చిత్రాలు ప్రదర్శితమై రష్యన్ల మన్ననలు అందుకున్నాయి. ఈ వేడుకలో చిరంజీవి, నాగబాబు, నిర్మాత ఏడిద నాగేశ్వరరావు పాల్గొన్నారు. రెండు నెలలల వ్యవధిలో అమెరికా, రష్యాలకు ప్రత్యేక అతిథిగా సందర్శించిన ఘనత చిరుకి దక్కింది. జాతీయ అవార్డుల పరంగా చిరంజీవికి ఎంత అన్యాయం జరిగిందో తెలిసిందే! ప్రతిభ ఆధారంగా కాకుండా లాలూచిపడి, రాజకీయాలు చేసి అవార్డులు ఎంపిక చేయడం వల్ల చిరంజీవికి దక్కాల్సిన కొన్ని అవార్డులు చేజారి మరెవరికో వెళ్లాయి. అయినా చిరంజీవి పట్టించుకోలేదు. ప్రజాభిమానాన్ని మించిన అవార్డు లేదని చిరు నమ్ముతారు.
‘ స్వయంకృషి, అపద్బాంధవుడు’ ఇంద్ర చిత్రాలకు గానూ ఉత్తమ నటుడిగా నంది పురస్కారాలు అందుకున్నారు. రఘుపతి వెంకయ్య అవార్డుతో కూడా గౌరవించబడ్డారు. చిరు ఖాతాలో ఎనిమిది ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, ఒక లైఫ్‌టైమ్ ఎఛీవ్‌మెంట్ అవార్డు ఉన్నాయి. ఇన్నిసార్లు ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్న ఏకైక స్టార్ హీరోగా చిరంజీవి గుర్తింపు పొందారు. ఆఫ్‌బీట్ చిత్రాల్లో నటించే నాన్ రెగ్యులర్ ఆర్టిస్ట్‌లకు మాత్రమే ఇలాంటి అవార్డులు వస్తాయనే అభిప్రాయం అప్పట్లో ఉండేది. అలాంటివి ఓ ప్రాంతీయ భాషలో నంబర్‌వన్ స్టార్‌గా ఎదుగుతున్న హై ఓల్టేజ్ కమర్షియల్ స్టార్‌కు ఎనిమిదిసార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డు రావడం అభినందనీయం.
మదర్ థెరిసా స్ఫూర్తితో చిరంజీవి(Megastar Chiranjeevi) నెలకొల్పిన స్వచ్ఛంద సేవా సంస్థ ‘చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్. తనని నంబర్‌వన్ స్టార్‌గా అక్కున చేర్చుకున్న తెలుగు వారికోసం ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతో పుట్టుకొచ్చినదే ఈ ట్రస్ట్. సీసీటీ గురించి తెలుసుకుంటే ఎన్నో ఆసక్తికర విషయాలు మనల్ని కదిలిస్తాయి. ఈ ట్రస్ట్ ఏర్పడటానికి కారణం ‘ది డార్క్’ అనే డాక్యుమెంటరీ. చెన్నైలో చిరంజీవి శిక్షణ పొందుతున్న రోజులవి. అక్కడ విద్యార్థులకు ఒకరోజు ‘ది డార్క్’ షో వేశారు. సినిమా మొదలయ్యాక తెరపై కాసేపటి వరకూ ఏమీ కనిపించలేదు. అంతా చీకటి. అక్కడున్నవారితోపాటు చిరంజీవి కూడా విజిల్స్ వేసి హంగామా చేశారు.
అయితే ఆ తర్వాత వినిపించిన మాటలే మంత్రాలై చిరంజీవి(Megastar Chiranjeevi)ని ఆలోచించేశారు. ‘‘ కొన్ని క్షణాల చీకటిని మీరు తట్టుకోలేకపోయారు. అసహనానికి గురయ్యారు. మరి జీవితకాలపు చీకటిని అనుభవిస్తున్న వారి గురించి ఎప్పుడైనా ఆలోచించారా? వారికి మీ చేయూత అవసరం కాదా’ అంటూ ఆ డాక్యుమెంటరీ మొదలైంది. ఆ మాటలు చిరంజీవిని నీడలా వెంటాడాయి. అంతే వెలుగు ఖడ్గంతో అంధకారాన్ని తరిమకొట్టాలని ప్రతిన పూనారు. అదే జీవితాశయంగా భావించారు. ఎంతో ఉన్నతి సాధించినా.. మంచితనం, మానవత్వాన్ని మించిన సద్గుణాలు లేనేలేవనే సత్యాన్ని ఆకళింపు చేసుకున్నారు. నా చుట్టూ ఉన్న యువతకు ‘నేనెందుకు స్ఫూర్తి కాకూడదు’ అన్న ఆలోచన మెగాస్టార్ స్ఫురించిన ఫలితమే రక్తనిధి, నేత్ర నిధి ఏర్పాటు. 1998 అక్టోబర్ 2న నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పంజాగుట్టలో చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చిరంజీవి ఐ అండ్ బ్లడ్‌బ్యాంక్ మొదలైంది.
చిరంజీవి(Megastar Chiranjeevi) పిలుపుతో లక్షలాది మంది అభిమానులు రక్తదానం చేశారు. 1998లో అద్దె భవనంలో మొదలైన సీసీటీ 2006 కల్లా సొంత భవనం సమకూర్చుకుంది. అంధులకు వెలుగు తెప్పించే నేత్రాలయంగా, రక్తదానం చేసి ప్రాణాలు కాపాడే ప్రాణాలయంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకూ సుమారు 9000లకు పైగా అంధుల జీవితాల్లో వెలుగు తెప్పించారు. 7.30.000లకు పైగా మంది పేద రోగులకు రక్తం అందించి ప్రాణదానం చేశారు. నటి రాష్ట్రపతి అబ్ధుల్ కలాం 2006 జూన్ 10న బ్లడ్‌బ్యాంక్‌ను సందర్శించి చిరంజీవిని ప్రశంసించారు. ఇక వ్యక్తిగతంగా కూడా చిరంజీవి చేసే గుప్తదానాలకు లెక్కలేదు. కుడి చేత్తో ఇచ్చిన దానం ఎడమ చేతికి తెలియకూడదన్న నియమాన్ని ఆయన పాటిస్తారు. చిత్ర పరిశ్రమలో బాధితులకు అండగా ఉంటారు. కష్టాల్లో ఉన్న అభిమానుల పాలిట ఆత్మీయుడిగా మెలుగుతారు. సొంత సంస్థల్లో పని చేసే సిబ్బందికి పెద్ద అన్నయ్యగా వ్యవహరిస్తారు.
‘ప్రాణం ఖరీదు’ చిత్రంతో 1978లో ప్రారంభించిన చిరంజీవి(Megastar Chiranjeevi) జైత్రయాత్ర 2006లో పద్మభూషణ్ పురస్కారంతో శిఖరాగ్రానికి చేరింది. ఆ వార్త వినగానే తమ అభిమాన నటుణ్ణి గుర్తించి, గౌరవించినందుకు మెగా అభిమానులు తెలుగు ప్రేక్షకులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఢిల్లీలోని అప్పటి రాష్ట్రపతి అబ్ధుల్ కలామ్ చేతుల మీదుగా పురసార్కం అందుకున్నారు.
2006 ఏప్రిల్ 23న తెలుగు చిత్ర పరిశ్రమ తమ కథానాయకుడిని ఘనంగా సత్కరించింది. గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఈ సత్కార కార్యక్రమానికి బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దర్శకరత్న దాసరి నారాయణరావు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. చిరంజీవి(Megastar Chiranjeevi) సరసన నటించిన తొలి హీరోయిన్ రేష్మిరాయ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే ఏడాది మరో గౌరవం కూడా చిరుకి దక్కింది. ఆంధ్రా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. సి. రంగరాజన్, శాస్త్రవేత్త శివథాను పిళ్లైతో కలిసి చిరంజీవి గౌరవ డాక్టరేట్ స్వీకరించడంతో 2006 నవంబర్ 6న జరిగిన స్నాతకోత్సవానికి ఒక ప్రత్యేకత చేకూర్చినట్లు అయింది. అంతే కాదు ఈ ఏడాది దేశంలో రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ పురస్కారం కూడా ఆయనకు దక్కింది.
Also Read : Thalapathy Vijay: సెన్సార్ పూర్తిచేసుకునన దళపతి విజయ్ ‘గోట్’ !