Hanu Raghavapudi: ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ‘సీతారామం’ తో కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న దర్శకుడు హను రాఘవపూడి. వైజయంతీ మూవీస్ పతాకంపై మలయాళం స్టార్ హీరో దుల్కర్ సాల్మన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ సినిమా… తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు హిందీలో కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీనితో ఈ టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి… ప్రభాస్ తో సినిమా తీయనున్నారంటూ గత కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆ పుకార్లను నిజం చేస్తూ ఇదే విషయాన్ని స్వయంగా ఆయనే అధికారికంగా ప్రకటించారు. ఇటీవల ఓ సినిమా ఈవెంట్లో పాల్గొన్న హను రాఘవపూడి…. త్వరలో ప్రభాస్ తో సినిమా తీయనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. అంతేకాదు ఆ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను కూడా వెల్లడించారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.
Hanu Raghavapudi Movie Updates
ఇటీవల ఓ ఈవెంట్లో పాల్గొన్న దర్శకుడు హను రాఘవపూడి(Hanu Raghavapudi) మాట్లాడుతూ… ‘నా తర్వాత సినిమా ప్రభాస్ తో ఉంటుంది. అది పూర్తిస్థాయి పీరియడ్ యాక్షన్ డ్రామా. చారిత్రక ఫిక్షన్ చిత్రం. ఇప్పటికే విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రం కోసం మూడు పాటలు కూడా కంపోజ్ చేశారు’ అని చెప్పారు. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నట్లు చెప్పడంతో అభిమానులు సంబరపడుతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రానుంది. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.
‘సలార్’తో సూపర్ హిట్ అందుకున్న ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వలో రానున్న ‘కల్కి 2898 ఏడీ’ చిత్రీకరణ చివరిదశలో ఉంది. ఇది మేలో ప్రేక్షకుల ముందుకురానుంది. దీనితోపాటు మారుతి డైరెక్షన్‌లో ‘రాజాసాబ్’లో నటిస్తున్నారు. రొమాంటిక్ హారర్ కామెడీ నేపథ్యంలో రానున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. వీటి తర్వాత ‘శౌర్యాంగపర్వం’ పేరుతో సలార్-2 రానుంది. దీని ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అలాగే మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతోన్న ‘కన్నప్ప’లోనూ ప్రభాస్ కనిపించనున్నారు. ఇప్పుడు ఈ హీరో లైనప్ లో హను రాఘవపూడి సినిమా కూడా చేరింది.
Also Read : Hi Nanna: అంతర్జాతీయ వేదికపై మరోసారి సత్తా చాటిన నాని ‘హాయ్ నాన్న’ !