తెలుగు సినిమా రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. క్రైమ్, థ్రిల్లర్, సోషియో ఫాంటసీ, వినోదం, రొమాన్స్ , భావోద్వేగాలను పండించేలా కథలు తయారవుతున్నాయి. హీరో హీరోయిన్ల కంటే స్టోరీ ప్రధాన అంశంగా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు యువ, ఔత్సాహిక దర్శకులు.
నిర్మాతలు కూడా ఎవరినంటే వారిని తీసుకునేందుకు ఇష్ట పడటం లేదు. ముందు కథ నచ్చాలి. ఆ తర్వాతే హీరో , హీరోయిన్లు, సాంకేతిక నిపుణులను ఎంపిక చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే తాజాగా ఓం ప్రకాశ్ దర్శకత్వంలో గుణ సుందరి కథ ట్రైలర్ రిలీజ్ అయ్యింది.
దీనికి ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ లభించింది. దీంతో అక్టోబర్ 13న శుక్రవారం గుణ సుందరి కథను విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. చూసేందుకు చిన్న చిత్రం అయినప్పటికీ కథ బలంగా ఉంది. అంతకు మించి సన్నివేశాలను డామినేట్ చేసేలా డైలాగులు ఉన్నాయి.
విచిత్రం ఏమిటంటే సినిమాను ముందుగా చూసిన సెన్సార్ టీం ఈ చిత్రాన్ని అభినందించడం. ఇక గుణ సుందరి కథలో సునీత సద్గురు, కార్తీక్ సాహస్ , రేవంత్ , ఆనంద చక్రపాణి, అశోక్ చంద్ర, ఉదయ్ భాస్కర్ , లలితా రాజ్ , స్వప్న, బేబి తేజో సాత్విక నటించారు. కథ, మాటలు, పాటలు అన్నీ సిద్దార్థ రాశారు.