Genelia D’souza: హ హ హాసిని అంటూ బొమ్మరిల్లు సినిమాతో ప్రేక్షకుల్ని మంత్ర ముగ్ధులను చేసిన జెనీలియా మరోసారి నిర్మాతగా మారుతోంది. గతంలో ‘మౌలీ’, ‘వేద్’ అనే మరాఠీ చిత్రాల్లో కీలక పాత్ర పోషించడంతో పాటు నిర్మాతగా వ్యవహరించిన జెనీలియా(Genelia D’souza)… మళ్లీ ‘రాజా శివాజీ’ అనే సినిమాను నిర్మిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సినిమాను ఆమె భర్త, నటుడు రితేశ్ దేశ్ ముఖ్ తెరకెక్కిస్తున్నారు. ఇదే విషయాన్ని తన సోషల్ మీడియా ఇన్‌స్టా వేదికగా ప్రకటించింది. ‘మన దేశ చరిత్ర, సంస్కృతి, గొప్పదనానికి ప్రతీకగా నిలిచిన ఛత్రపతి శివాజీ మహరాజ్ కథను తెరకెక్కించాలని కొన్నేళ్లుగా అనుకుంటున్నాం. ఎన్నో ఏళ్ల మా ఆ కల ‘రాజా శివాజీ’ తో నెరవేరబోతోంది. ఈ సినిమా నిర్మించడం మాకు గౌరవమే కాదు… ఓ పెద్ద బాధ్యత కూడా. ఈ ప్రయాణంలో మీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము’ అంటూ భావోద్వేగంతో కూడిన వివరణ రాసుకొచ్చింది. దీనితో జెనీలియా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. జెనీలియా, రితేశ్ దేశ్ ముఖ్ అభిమానులతో పాటు ఛత్రపతి శివాజీ అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు.
Genelia D’souza Movie Updates
ఇటీవల విడుదలైన ‘వేద్’ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని నమోదు చేయడంతో రితేశ్ దేశ్ ముఖ్ మొదటిసారిగా మెగాఫోన్ పట్టబోతున్నాడు. ‘రాజా శివాజీ’ సినిమాలో ఛత్రపతి శివాజీ పాత్రలో కనిపించడంతో పాటు… ఈ చారిత్రక సినిమాకు దర్శకత్వం కూడా తానే వహిస్తున్నాడు. ఈ సందర్భంగా ‘ఛత్రపతి శివాజీ మహారాజ్ అనేది ఒక పేరు కాదు ఒక భావోద్వేగం. శివాజీ జయంతిని పురస్కరించుకుని ఈ నేల కన్న గొప్ప నాయకుడికి నేను నివాళులర్పిస్తున్నా. అతడి జీవిత ప్రస్థానం తరతరాలుగా స్ఫూర్తి రగిలిస్తోంది. శివాజీ ఆశీస్సులతో కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాం. జై శివ్‌రాయ్‘ అని రితేశ్ దేశ్‌ముఖ్ ట్వీట్ చేశాడు. జాతీయ అవార్డు గ్రహీత సినిమాటోగ్రాఫర్ సంతోశ్ శివన్ ఈ సినిమాతో మరాఠీ సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. అజయ్ తుల్ సంగీతం అందిస్తుండగా… త్వరలోనే షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు చిత్రబృందం తెలిపింది. జియో స్టూడియోస్ సమర్పణలో ముంబై ఫిల్మ్ అకాడమీ బ్యానర్‌లో ‘రాజా శివాజీ’ సినిమా తెరకెక్కుతోంది.
Also Read : Mrunal Thakur: కొత్త ఫ్లాట్ కొన్న ‘సీతారామం’ బ్యూటీ !